జగన్ తీరు దొంగే దొంగ అన్నట్టు .. రేవంత్ పగటి వేషగాడు : తెలంగాణా మంత్రి జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాజాగా చోటు చేసుకున్న జల వివాదాలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగ అన్న చందంగా ఉందని మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా, ఎన్ని కుయుక్తులు చేసినా, కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేసినా, ఆయన ఆటలు సాగవని జగదీశ్ రెడ్డి విమర్శించారు.

జలదోపిడీ చేస్తూ జగన్ నీతులు.. అయినా ఆయన ఆటలు సాగవు
పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని వినియోగిస్తున్నారని ఆరోపించిన ఆయన వైయస్ జగన్ ప్రభుత్వం 203 జీవో ను వెనక్కు తీసుకుని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. జల దోపిడీ చేస్తూ సీఎం జగన్ నీతులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ సర్కార్ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాస్తూ రోజుకో కొత్త డ్రామాకు తెర తీస్తుందని విమర్శించారు.ఇంతకాలం శ్రీశైలం ప్రాజెక్టు నుండి వరదనీరు పేరుతో నదీ జలాలను అక్రమంగా తరలించుకుపోయారు అని విమర్శించారు.

పగటి వేషగాళ్ళు పగటి కలలు ... రేవంత్ పై ధ్వజం
తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోమని ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన జగదీశ్ రెడ్డి, కొంతమంది పగటివేషగాళ్ళు పగటికలలు కంటున్నారని, అధికారంలోకి వస్తామని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని అనుకుంటున్నారని, కానీ అది వారి తరం కాదని ఆయన తేల్చి చెప్పారు. కెసిఆర్ బతికున్నంత కాలం ప్రజలు కెసిఆర్ పాలన వదులుకోలేరని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ ని మించిన నాయకుడు కనుచూపు మేరలో లేరు
తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కెసిఆర్ ని మించిన నాయకుడు కనుచూపుమేరలో లేరని కెసిఆర్ పాలన కితాబిచ్చారు. ప్రతిపక్షాలు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదని మాట్లాడిన జగదీశ్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉందని రేవంత్ పరిస్థితిని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలందరూ సీఎం కేసీఆర్ కు అండగా ఉంటున్నారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు.రేవంత్ రెడ్డి ఓ పగటివేషగాడు అని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు గతంలో ఎప్పుడూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, ఆంధ్ర ప్రాంతానికి లాభం చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications