రాజాసాబ్ టికెట్ రేట్లపై తేల్చేసిన కోమటిరెడ్డి..! ఎవర్నీ రావొద్దన్నా..!
తెలంగాణాలో టాలీవుడ్ చిత్రాల టికెట్ రేట్ల పెంపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా విడుదలైన ప్రభాస్ మూవీ రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ సదరు ఆదేశాల్ని రద్దుచేయడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో రేట్లు పెంచబోమని చేసిన వ్యాఖ్యల్ని కూడా ప్రస్తావించడంతో ఆయన ఇరుకునపడ్డారు.
ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో టికెట్ రేట్లు పెంచబోమని ఆయన చేసిన వ్యాఖ్యలను హైకోర్టు మరోసారి గుర్తు చేసిన నేపథ్యంలో దీనిపై స్పందించారు. ఈసారి రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉంటూ సినిమా టికెట్ రేట్ల పెంపుతో తనకు సంబంధం లేదంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని కోమటిరెడ్డి ఇవాళ వెల్లడించారు. పుష్ప-2 సినిమా తర్వాత తన దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని చెప్పినట్లు గుర్తుచేశారు. దీంతో తనను ఎవ్వరూ కలవడం లేదన్నారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలోనే మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డానని కోమటిరెడ్డి తెలిపారు. అప్పట్లో గాయాలపాలైన బాబు ట్రీట్మెంట్ కు కూడా తానే డబ్బులు ఇచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు సినిమాలకు పెరిగిన ధరలకు తనకూ ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పేశారు.












Click it and Unblock the Notifications