బీజేపీ-వంద అబద్ధాలు- సోషల్ మీడియా ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ వార్..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన ప్రణాళికలన్నింటినీ రూపొందించుకుంటోంది బీఆర్ఎస్. హ్యాట్రిక్ కొట్టి తీరాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఇందులో భాగంగా- తమ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. బీజేపీ, కాంగ్రెస్ వైఖరినీ ఎండగట్టుతోంది.

తాజాగా- బీజేపీ హామీలపై కన్నేసింది. 2014 నుంచీ కేంద్రంలో అధికారంలో ఉంటూ వస్తోన్న కమలనాథులు ఇచ్చిన హామీలన్నింటినీ జనంలోకి తీసుకెళ్లడానికి భారీ స్కెచ్ వేసింది. బీజేపీ వంద అబద్ధాలు పేరుతో ప్రత్యేకంగా ఓ సీడీ, బుక్‌లెట్‌ను రూపొందించింది బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం.
ఈ సీడీ, బుక్‌లెట్‌ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ- మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వాటిని విడుదల చేశారు. వంద అబద్ధాలను సేకరించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాన్ని ఆయన అభినందించారు.
తెలంగాణతో పాటు దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేర్వేరు సందర్భాల్లో చేసిన హామీలు, వాగ్దానాలను ఇందులో గుదిగుచ్చింది. మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదనే విషయాన్ని సామాన్య ప్రజలకు సైతం విడమరిచి వివరించేలా ఈ సీడీ, బుక్‌లెట్‌ను తీర్చిదిద్దింది.
ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారం, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, అందరికీ ఇళ్లు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ సీసీఐ, వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్లతో సహా బీజేపీ ఇచ్చిన విఫల హామీలను ఇందులో చేర్చింది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్.. వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా ఈ బీజేపీ వంద అబద్ధాలు సీడీని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లబోతోంది. గరిష్ఠ సంఖ్యలో ఇంటర్నెట్, సోషల్ మీడియా యూజర్లకు వీటిని చేరవేసేలా బీఆర్ఎస్ సోషల్ మీడియా కసరత్తు మొదలు పెట్టింది.












Click it and Unblock the Notifications