పవన్ కు తెలంగాణ మంత్రి వార్నింగ్..! ఆ మాటలు వెనక్కి తీసుకోకపోతే..!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా తెలంగాణపై విమర్శలకు దిగారు. కోనసీమలో కొబ్బరిచెట్లు వాలిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు తెలంగాణ నేతలు పచ్చని గోదావరి జిల్లాల్ని చూసే ప్రత్యేక రాష్ట్రం అడిగారంటూ తెలిపారు. ఆ విధంగా రాష్ట్ర విభజనలో గోదావరి జిల్లాల పాత్ర ఉందంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో మంట పుట్టించాయి.
పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణలో వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు సరికాదని, రాష్ట్రం విడిపోయినా ఇంత ద్వేషం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్‌లో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మంత్రి శ్రీహరి చురకలు అంటించారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలన్నారు. తెలంగాణలో వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగావంటూ పవన్ పై వ్యాఖ్యలు చేశారు. మైలేజ్ పొందాలంటే పనితనం చూపించు.. ఇలా కాదు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి పవన్ కు హితవు పలికారు. తద్వారా పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.

తెలంగాణ విభజన విషయంలో పవన్ కళ్యాణ్ గతంలోనూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని తెలంగాణకు మద్దతుగా, మరికొన్ని తెలంగాణపై విషం చిమ్మేవిగా ఉండటం విశేషం. తెలంగాణ విభజన తర్వాత 11 రోజులు భోజనం చేయలేదంటూ పవన్ గతంలో వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలంగాణ విభజన అవసరమని తానే చెప్పానని కూడా చెప్పారు. ఇప్పుడు తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications