Telangana MLC: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Telangana MLC: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 11న నామినేషన్ల పరీశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ల పదవీకాలం ఈ నెల 29న ముగియనుండడంతో ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఐదుగురి స్థానంలో కొత్తవారిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ పార్టీలకు ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి అధికార కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీ సీట్లు, బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ టికెట్ రెండు పార్టీల్లోనూ ఇప్పటికే పోటీ నెలకొంది. టికెట్ దక్కితే గెలుపు కానున్న నేపథ్యంలో నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ టికెట్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానుండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి.












Click it and Unblock the Notifications