Telangana: 100శాతం సీట్లతో థియేటర్లు -ఇంకొద్ది గంటల్లో ఓపెన్ -TFCC ప్రకటన -కొవిడ్ 3వ వేవ్?
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం పూర్తిగా తగ్గకముందే మూడో వేవ్ తలెత్తనుందనే భయాల నడుమ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో, తెలంగాణలో మాత్రం సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు 100 శాతం సీట్లతో తెరుచుకోనున్నాయి. తెలంగాణలో ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవాలని రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది.
కరోనా లాక్‌డౌన్ వల్ల థియేటర్లు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఎగ్జిబిటర్లు పలుమార్లు తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించడం, తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి వివరంచిన నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి థియేటర్లను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ రావడంతో ఆదివారం నుంచి సినిమా హాల్స్ తెరవాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్, థియేటర్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది.

ఎగ్జిబిటర్లు ఎవరైనా రేపటి నుంచి సినిమాలను ప్రదర్శించుకోవచ్చని, ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న దృష్ట్యా థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం సీట్ల సామర్థ్యంతో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగించాలని తీర్మానించినట్లు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కార్యదర్శి విజయేందర్ రెడ్డి తెలిపారు. కాగా,
100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోనున్న వేళ.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రభుత్వానికి కీలక వినతులు చేసింది. 2017లో తీసుకొచ్చిన జీఓ.75ను తొలగించాలని, సినిమా హాళ్లలో పెయిడ్ పార్కింగ్ కు అనుమతివ్వాలని, లాక్ డౌన్ వల్ల థియేటర్లు నష్టపోయినందున రాబోయే రోజుల్లో కరెంటు బిల్లుల్ని తగ్గించాలని, సినిమా హాళ్లకు రెండేళ్ల పాటు మున్సిపల్/ప్రాపర్టీ ట్యాక్స్, జీఎస్టీ టాక్స్ నుంచి మినహాయింపు కల్పించాలని ఛాంబర్ కోరింది.












Click it and Unblock the Notifications