ఉద్యోగుల మధ్య విభజనకు కుట్ర .. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగుల భవిషత్తును అంధకారంలోకి నెడుతోందని దుయ్యబట్టారు. బడికెళ్లీ పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముందు ఆందోళన చేయాల్సిన పరిస్థి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న దంపతులను చెట్టుకొకరు, పుట్టకొకర్ని బదిలీ చేస్తూ.. సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శలు గుప్పించారు.

ఉద్యోగుల మధ్య విభజన చిచ్చు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకి వ్యతిరేకంగా 317 జీవో తీసుకొచ్చి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. స్థానికులను కూడా స్థానికేతరులుగా మార్చి ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని విమర్శించారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. ఉద్యోగుల మధ్య విభజన తీసుకువచ్చి చిచ్చుపెడుతోందని దుయ్యబట్టారు. బదీలీల్లో ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ముందుంది కొట్లాడినోళ్లు ఉపాధ్యాయులేనని రేవంత్ పేర్కొన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు
ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో ఉద్యోగుల భవిష్యత్ చీకట్లోకి వెళ్తుందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో టీఆర్ఎస్ పాత్రధారులైతే.. బీజేపీ సూత్రధారులని విమర్శించారు
బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమకు అధికారం ఇస్తే 317 జీవో రద్దు చేస్తామని బూటకపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ఈ జీవో ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్రంలో ఆధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కలం పోటుతో ఈ జీవోను ఆపివేయోచ్చని పేర్కొన్నారు. 317 జీవో, ఉద్యోగాల నోటిఫికేషన్లపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని రేవంత్ స్పష్టం చేశారు. తమ పోరాటాలను కరోనా నిబంధనల పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్.

పనిచేయనివారికి పార్టీలో చోటు లేదు
అటు తెలంగాణలో పార్టీ డిజిటల్ మెంబర్ షిప్‌పై రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో సమీక్షించారు. మండలాల్లో పార్టీ అధ్యక్షులు పనిచేయకపోతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు, నేతలు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని సూచించారు. 5 మండలాల్లో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుస్తాం. అదే 35 మండలాల్లో బలంగా ఉంటే ఎంపీ సీటు గెలుస్తాం. 600 మండలాల్లో బలపడితే రాష్ట్రంలోనే అధికారంలోకి వస్తామని పార్టీ నేతలకు వివరించారు. ప్రజా సమస్యలపై పోరాడేది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications