Telangana Polls: తెలంగాణలో మారిపోతున్న లెక్కలు ! అజెండా సెట్టరే విన్నర్ అవుతారా ?
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తోంది. రాష్ట్రంలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ రెండు ఎన్నికల్లో నల్లేరు నడకగా సాగిపోయిన అధికార బీఆర్ఎస్ మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కౌంటర్ గా కొత్త అజెండాతో ఓటర్లకు ఫ్రెష్ లుక్ ఇచ్చేందుకు విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో మరో 13 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది.
తెలంగాణ ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు అంత నమ్మకాలు లేవు. అంతే కాదు ఈసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు తప్పదన్న అంచనాల్లోనే ఉన్నారు. కానీ కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత ఆ నమ్మకాలు పటాపంచలు అయ్యాయి. అంతే కాదు కాంగ్రెస్ కు గెలిచే సత్తా ఉందని, అదీ పాజిటివ్ అజెండాతో ఇప్పటికే కాంగ్రెస్ గెలవగలదనే భరోసాను కర్నాటక ఫలితాలు ఇచ్చాయి. ముఖ్యంగా విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కర్నాటకలో కాంగ్రెస్ చేసిన పోరుకు జనం మద్దతు లభించడంతో ఆ ప్రభావం తెలంగాణపై గట్టిగానే పడింది.

తెలంగాణలో అప్పటికే బీజేపీ విద్వేష రాజకీయాలు మొదలుపెట్టడం, కాషాయ పార్టీకి అధికారం లభిస్తే ఏ జరుగుతుందో ఇక్కడి ప్రజలకు క్లారిటీ ఉండటంతో ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీని పక్కనబెట్టేశారు. అయితే దాని స్ధానంలో మరో పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి ఓటర్లు కాంగ్రెస్ వైపు చూడటం మొదలుపెట్టారు. ఈ పరిస్ధితిని కాంగ్రెస్ కూడా ఊహించలేదు. కానీ అందివచ్చిన పరిస్ధితిని సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగింది.
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపును పదే పదే ప్రస్తావిస్తూ తెలంగాణను కూడా గెలవబోతున్నామని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం మొదలుపెట్టేశారు. అదీ భారత్ జోడో యాత్ర తర్వాత జరుగుతున్ నఎన్నికలు కూడా కావడతో రాహుల్ గాంధీపై పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. అది క్రమంగా పాజిటివ్ అజెండాగా బలపడుతూ వచ్చింది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణపైనా ఆ ప్రభావం గట్టిగానే పడుతుందనే అంచనాకు వచ్చిన కేసీఆర్ తిరిగి తన పాత సెంటిమెంట్ ను ప్రయోగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ ఏ కర్నాటక హామీలతో విజయం సాధించామని చెప్పుకుంటుందో వాటి డొల్లతానాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఎక్కడికక్కడ వాటిని అడ్డుకుంటోంది.ఫైనల్ గా కర్నాటక అజెండాతో తెలంగాణ ఎన్నికల్ని కూడా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ అజెండా సెట్టర్ గా మారిపోయింది. దీంతో జనంలో నుంచి కర్నాటక అజెండాను తీసేసేందుకు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అది జరిగితే కానీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవని గ్రౌండ్ నుంచి అందుతున్న సమాచారం.












Click it and Unblock the Notifications