మరో అల్పపీడనం.. తెలంగాణాను తీవ్రంగా హెచ్చరిస్తోన్న బంగాళాఖాతం!!
తెలంగాణ ప్రజలకు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ కు సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది పశ్చిమ వాయువ్యదిశగా పైనుంచి తీవ్రవాయుగుండం గా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనివల్ల తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది.
తెలంగాణలో నాలుగైదు రోజులు వర్షాలు
గత నెల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగం సంతోషంతో ఉంది. వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా, జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులలో వరద నీరు పోటెత్తడంతో అవి జలకళను సంతరించుకున్నాయి. ఇక తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

నేడు వర్షాలు ఈ జిల్లాలలోనే
నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, కొత్తగూడెం, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, సూర్యపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, జనగామలలో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఈదురుగాలులతో కూడిన వర్షాలు
అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా వరద
ఇదిలా ఉంటే భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణ, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులోని పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కృష్ణానది పోటెత్తుతోంది. దీంతో కృష్ణ పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నాగార్జున సాగర్ నీటిమట్టం ఇలా
ప్రస్తుతం నాగార్జునసాగర్ వద్ద నీటిమట్టం 549 అడుగులకు చేరుకుంది నాగార్జునసాగర్ నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా దాదాపు ఫుల్ ట్యాంక్ లెవల్ కు వరద నీరు చేరుకుంటుంది లోటు ఉండదని ఆయకట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. మరోవైపు నాగార్జునసాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిని కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది.












Click it and Unblock the Notifications