తెలంగాణానూ వదల బొమ్మాలీ అంటున్న ఫెంగల్ తుఫాను.. ఈ జిల్లాలలో వర్షాలు, అలెర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడి నిన్న రాత్రి తీరం దాటిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ క్రమంలో ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
తెలంగాణాపై ఫెంగల్ తుఫాను ప్రభావం
నైరుతి బంగాళాఖాతంలోని పెంగల్ తుఫాను నిన్న రాత్రి తీరాన్ని తాకడంతో దీని ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రం తో పాటు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ఇక దీని ప్రభావం తెలంగాణా రాష్ట్రంపై కూడా కనిపిస్తుంది.

నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన
నేడు తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. డిసెంబర్ రెండవ తేదీన మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ పేర్కొంది.
డిసెంబర్ 2న ఈ జిల్లాలలో వర్షాలు
కాగా డిసెంబర్ 2 వ తేదీన కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వనపర్తి , నారాయణపేట గద్వాల జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎటువంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణా ప్రజలకు అలెర్ట్
ఇక చలికాలంలో కురిసే ఈ ఆకస్మిక వానలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వర్షాలు కురిసే జిల్లాలలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. దీని ప్రభావం నాలుగు రోజుల పాటు తెలంగాణాపై ఉండటంతో తెలంగాణా ప్రజలు కూడా అందుకు తగినట్టు సిద్ధంగా ఉండాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications