ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, స్కైబాబాపై దాడి యత్నాన్ని ఖండిస్తున్నాం: నందిని సిధారెడ్డి

Subscribe to Oneindia Telugu
  స్కైబాబా పై బెజవాడ దాడి : నిరసన సెగ, విజయవాడలో ఉద్రిక్తత

  హైదరాబాద్: రచయిత స్కైబాబాపై విజయవాడ బుక్ ఫెయిర్‌లో కొంతమంది మూకుమ్మడి దాడికి యత్నించడాన్ని తెలంగాణ సాహితీ అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి తీవ్రంగా ఖండించారు.

  స్కైబాబాపై అక్కడివాళ్లు ప్రదర్శించిన దుందుడుకు తనాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహుజన రచయిత పసునూరి రవీందర్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.

  ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు జూలూరీ గౌరీ శంకర్, సాహితీ విమర్శకులు జి.లక్ష్మీ నర్సయ్య, కవి సిద్దార్థ, కవి యాకూబ్, జర్నలిస్ట్ ఏశాల శ్రీనివాస్, యలవర్తి రాజేంద్రప్రసాద్, పర్స్‌పెక్టివ్స్ ఆర్కే, సీఎం పీర్వో రమేష్ హజారి, కవి జుగాష్ విల్లి స్కైబాబాకు మద్దతు ప్రకటిస్తూ దాడిని ఖండించారు.

   నందిని సిధారెడ్డి:

  నందిని సిధారెడ్డి:

  రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత.. ఒక ఆరోగ్యకర వాతావరణం ఇరువైపులా నెలకొన్న పరిస్థితుల్లో స్కైబాబాపై ఇలాంటి దాడికి యత్నించడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం మంచిది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

  హైదరాబాద్ వాళ్లు విజయవాడకు, విజయవాడ వాళ్లు హైదరాబాద్ కు వెళ్లడానికి ఎలాంటి జంకూ బొంకూ లేని ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి. ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై కూడా ఉంది.

   జూలూరీ గౌరీ శంకర్:

  జూలూరీ గౌరీ శంకర్:

  దేశంలో ఢిల్లీ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు మంచి పేరు ఉంది. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నా ఎన్నడూ ఏ రచయితను ఇబ్బందిపెట్టిన దాఖలా లేదు. బుక్ ఫెయిర్‌లో ఏ రచయితకైనా కార్యక్రమాలు నిర్వహించుకునే స్వేచ్చ ఉండాలి.

   జి.లక్ష్మీ నర్సయ్య:

  జి.లక్ష్మీ నర్సయ్య:

  సందర్భాలకు అతీతంగా పదాల అర్థ తీవ్రత మారుతుంది. ఉద్యమ కాలం నాటి కవిత్వాన్ని పట్టుకుని ఇప్పుడు మాట్లాడటం సరైంది కాదు. ఉద్యమ కాలంలో రెండు వైపుల నుంచి ఆవేశంతో కూడుకున్న సాహిత్యం వచ్చింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

   స్కై బాబా:

  స్కై బాబా:

  విజయవాడ బుక్ ఫెయిర్‌లో మాకెలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మేం నిర్వహించాలనుకున్న పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాపై దాడికి వచ్చినవాళ్లలో సాహిత్యంతో సంబంధం లేనివాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందులోనూ టీడీపీ మనుషులే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దాడి వెనుక ఉద్దేశాలు వేరుగా ఉన్నాయనేది నా అభిప్రాయం.

  ఇంత జరుగుతున్నా.. నాకు రక్షణ నిలవడానికి అక్కడ ఎవరూ ప్రయత్నించలేదు. జర్నలిస్టు సజయ, రచయిత్రులు రమా సుందరి, మల్లీశ్వరి, శాంతిశ్రీమాత్రం నాకు రక్షణ కవచంగా నిలబడి కాపాడుకుంటూ బయటికి తీసుకువచ్చారు. అరసవిల్లి కృష్ణ, హర్ష వడ్లమూడి తోడు ఉన్నారు.

  ఆ రాత్రి దేశపతి శ్రీనివాస్ గారి సహాయంతో హైదరాబాద్, విజయవాడ, కమీషనర్ల కోఆర్టినేషన్‌తో మేం విజయవాడ నుంచి సురక్షితంగా హైదరాబాద్ రాగలిగాం.

   పసునూరి రవీందర్:

  పసునూరి రవీందర్:

  'నీ అభిప్రాయాలతో నాకు విభేదం ఉండవచ్చు కానీ నువ్వు మాట్లాడటం కోసం నేను ప్రాణమిస్తా' అన్నాడు ప్రసిద్ద ఫ్రెంచ్ రచయిత వాల్టెర్.

  రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి మూడున్నరేళ్లు గడిచిపోయినా తర్వాత ఈ సంఘటన జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ మూడున్నరేళ్లలో నేనూ, స్కై చాలాసార్లు ఆంధ్ర ప్రాంతంలో కార్యక్రమాలకు హాజరయ్యాం. అక్కడివాళ్ల అభిమానాన్ని చూరగొన్నాం.

  ఎన్నడూ మాపై ఎలాంటి వ్యతిరేకత రాలేదు.కానీ విజయవాడ బుక్ ఫెయిర్‌లో ఇలా ప్రత్యక్ష దాడికి దిగేదాకా వ్యవహారం వచ్చిందంటే.. దీని వెనకాల చాలా శక్తులు పనిచేసినట్లు అనుమానం కలుగుతోంది. ఇప్పటికీ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనే మేమంతా చెప్తూ వస్తున్నాం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana sahitya academy chairman Nandini Siddareddy, BC commission member Juluri Gouri Shankar condemned attack on writer Sky Baba.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి