తెలంగాణ స్పీకర్ అసాధారణ నిర్ణయం-బీఆర్ఎస్ మాజీకి 10 కోట్ల షాక్ !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయంలో మరో కీలక పరిణామం. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (telangana speaker) జాప్యం చేస్తున్న తరుణంలో ఆయనపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్.. ఇదే క్రమంలో ఆయన్ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసింది. దీంతో ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని నోటీసులు పంపారు.
బీఆర్ఎస్ కు చెందిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.. ఈ నెలలో ప్రెస్ మీట్లు పెట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆయన్నుబుల్లెట్ రాజు అని సంబోధించడంతో పాటు ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు స్వీకరిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. తనను మానసికంగా క్షోభ పెట్టినందుకు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నోటీసులు పంపారు.

వారం రోజుల్లో తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్ట ప్రకారం.. న్యాయస్థానాల ద్వారా ఈ మేరకు పరువునష్టం దావా వేసి తగు చర్యలు తీసుకుంటానని స్పీకర్ ప్రసాద్ కుమార్ హెచ్చరించారు. జనవరి 19న మీడియా సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ.. శాసన వ్యవస్థలో అత్యున్నతమైన శాసన సభాపతి పదవిని అవమానించే విదంగా తనపై ఆరోపణలు చేశారని స్పీకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో తాను వందల కోట్లు లంచంగా తీసుకున్నానని ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలిపారు. ఇది రాజ్యాంగ బద్దమైన పదవిని అవమానించడమేనన్నారు. అలాగే వికారాబాద్ మున్సిపాలిటీని తనకు అనుకూలంగా మార్చుకున్నారని చేసిన ఆరోపణలపైనా ఫైర్ అయ్యారు.

అట్టడుగు స్థాయి నుంచి వచ్చి శాసన వ్యవస్థలో అత్యున్నతమైన స్పీకర్ హోదాలో తాను ఉన్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం సహా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయిస్తున్నానని గుర్తుచేశారు. అలాంటి తనపై అసత్య ఆరోపణలు చేసి తన మనసును క్షోభ పెట్టినందుకు మెతుకు ఆనంద్ రూ.10 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటు ఏడు రోజుల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications