మెడికల్: 'టీ' విద్యార్ధులు విజయవాడ వెళ్లాల్సిందే..!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఎంసెట్ (మెడిసిన్) రాసిన విద్యార్థులు, కౌన్సెలింగ్ కోసం విజయవాడకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లోని సీట్ల భర్తీ కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌కు హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నం ఫలించలేదు.
దీంతో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఈ కౌన్సెలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో ఒప్పందానికి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలోరెండు రాష్ర్టాలు వేర్వేరుగా ఎంసెట్‌ను నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే.

పరీక్షతోపాటు కౌన్సెలింగ్‌ను కూడా ప్రత్యేకంగా ఎవరికి వారు నిర్వహించుకోవాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించారు. దీంతో మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తున్న తెలంగాణ సర్కారుకు కౌన్సెలింగ్ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో మెడికల్ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని కోరింది.
దీనికి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కూడా అంగీకరించింది. కౌన్సెలింగ్ విజయవాడలో జరిగినా, ఏపీ రాష్ట్ర విద్యార్థులతో సంబంధం లేకుండానే నిర్వహిస్తుస్తామని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తెలంగాణ విద్యార్థులు విజయవాడ వెళ్లాల్సిన పనిలేకుండా, హైదరాబాద్‌లోనే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది.
దీనిపై యూనివర్సిటీ అధికారులు అధ్యయనం చేసి, ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక సమస్యల దృష్ట్యా హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేయటం కష్టమని తెలిపారు. దీంతో విజయవాడలోని యూనివర్సిటీలోనే ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు, తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 40శాతం సీ-కేటగిరీ సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం-ప్రైవేటు ఉమ్మడి కమిటీ పర్యవేక్షణలో ప్రవేశ పరీక్షను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications