తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా అరెస్ట్
హైదరాబాద్: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(వీసీ) దాచేపల్లి రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8 గంటలపాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్ గుప్తాను అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో ప్రత్యేక ఏసీబీ కోర్టులో రవీందర్ గుప్తాను హాజరుపర్చనున్నారు.
అంతకుముందు పరిణామాలు గమనించినట్లయితే.. నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రవీందర్ గుప్తా లంచం డిమాండ్ చేయడంతో ఆయన అడిగిన మొత్తాన్ని నిర్వాహకులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరోవైపు, గత కొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలకమండలితో వీసీకి పడని విషయం తెలిసిందే. అయితే, వర్సిటీలో పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో వీసీ వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాజాగా, వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ పట్టుబడటం, అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారమంతా మరో మలుపు తిరిగింది. ఇప్పటికే వీసీ తీరుకు వ్యతిరేకరంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు.. ఇలా లంచం కేసులో పట్టుబడి అరెస్టు కావడంతో సంబరాలు చేసుకుంటుండటం గమనార్హం. ఈ వీసీ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications