కేసీఆర్ మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యిండు: బట్టెబాజ్ సీఎం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
హైదరాబాద్: వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహా ధర్నా, ఆందోళనలపై భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నాయకుడు టీ రాజాసింగ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను బట్టెబాజ్ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. మోసం, దగాతో ఆయన కాలం గడుపుతున్నారంటూ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తోన్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియోలను విడుదల చేశారు.
ఇందిరాపార్కు వద్ద కేసీఆర్ చేసిన ప్రసంగానికి కౌంటర్
మహాధర్నాను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగానికి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి సినిమా ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. దేశంలోనే బట్టెబాజ్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోయారని ఆరోపించారు. ప్రజలను వంచించడంలో కేసీఆర్‌ను మించిన రాజకీయ నాయకులు లేరని విమర్శించారు. గతంలో ధర్నా చౌక్ వద్ద నిరసనలు నిషేధించిన కేసీఆర్.. ఇప్పుడు స్వయంగా అక్కడికే వెళ్లి ఆందోళన చేశారని అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని చెప్పారు.

హుజురాబాద్ ఓటమితో
హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని రాజాసింగ్ అన్నారు. దాన్ని కప్పి పుచ్చుకునే పనిలో పడ్డారని అన్నారు. వ్యక్తిగత పనుల కోసం తరచూ ఢిల్లీ వెళ్లే కేసీఆర్.. రైతు సమస్యల మీద ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. రైతు చట్టాలు బాగున్నాయంటూ గతంలో కేసీఆర్ ప్రశంసలు కురిపించారని, ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారని నిలదీశారు. దీనికి కారణం- హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమిపాలు కావడమేనని చెప్పారు.

భయంతోనే ధర్నాలు..
టీఆర్ఎస్ పనైపోయిందనే భయంతోనే కేసీఆర్ ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ఒప్పందాల ప్రకారం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలుకు చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని, అందుకే కేసీఆర్ ఇలాంటి జిమిక్కులతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పేరుతో కేసీఆర్ దొంగదీక్షలు చేస్తోన్నారని, అది ఫ్లాప్ షోలా మారిందని అన్నారు.

ఒక్క గింజ కూడా మిగలకుండా కొంటామన్నారే..
రైతుల వద్ద నుంచి ఒక్క గింజను కూడా మిగలకుండా మొత్తం ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారని, దాన్ని ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. రైతును కాపాడుకోవడానికి వారి వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాము కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని రాజాసింగ్ చెప్పారు. కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను ముందు అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ మెంటల్‌గా డిస్టర్బ్..
విమర్శలు చేయడానికి కేసీఆర్ వద్ద సబ్జెక్ట్ లేదని, అందుకే కేసీఆర్ కొద్దిగా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారని ఆరోపించారు. ఇలాంటి ధర్నాలు, ఆందోళనలు దీనికి నిదర్శనమని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారని, దాన్ని అమలు చేశారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇస్తామన్న భరోసా ఏమైందని నిలదీశారు. ఇలాంటి సమస్యలు, అమలుకు నోచుకోని హామీలు ఎన్నో ఉన్నాయని రాజాసింగ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ వేస్తోన్న సినిమా ఫెయిల్ అవుతుందని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications