టెంపుల్ రష్: మహాలక్ష్మీ పథకం; మహిళల ఉచిత ప్రయాణాల స్పెషల్!!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతుంది. దీంతో మహిళలు ఉచిత ప్రయాణం కావడంతో ప్రయాణాలకు శ్రీకారం చుట్టారు. దీంతో టెంపుల్స్ లో రష్ పెరిగింది.
గతంతో పోల్చుకుంటే మహాలక్ష్మి పథకం వల్ల మహిళల ప్రయాణాలు పెరిగాయి. రోజువారి సగటున 28 లక్షల నుంచి 43 లక్షలకు ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అదనంగా ప్రయాణాలు చేస్తున్న వారిలో 90 శాతం మహిళలే ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మహిళలు ఎక్కువగా ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

బంధువుల ఇళ్ళకి ప్రయాణాలు చేసే వారు కొందరైతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుడులు, గోపురాలు, తీర్థయాత్రలు చేయడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటున్న మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. నిన్న ఒక్కరోజు కాళేశ్వరం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు కాళేశ్వరం ఆలయానికి వచ్చినట్టు తెలుస్తుంది.
స్వామివారి దర్శనానికి వెళ్లిన వారిలో ఎక్కువమంది మహిళలే ఉండడం, వీరంతా ఉచిత ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసిన మహిళలు కావడం గమనార్హం. ఫ్రీ ప్రయాణం చేయొచ్చని మహిళలందరూ గుంపులు గుంపులుగా తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారు. మళ్లీ భవిష్యత్తులో ఈ పథకాన్ని నిలిపివేస్తే బస్సుల్లో డబ్బులు పెట్టుకునే గుళ్ళకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా ఇప్పుడే రకరకాల తీర్థయాత్రల బాట పడుతున్నారు.
యాదాద్రి, కాళేశ్వరం, వేములవాడ, బాసర, జోగులాంబ ఆలయం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలకు ఉచిత బస్సులలో వెళ్లి దర్శనాలు చేసుకుని వస్తున్నారు. ఇక ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్ళ దెబ్బకు, మగవాళ్ళు బస్సు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న రద్దీని చూస్తే ఇంకా కొత్త బస్సులు వేయాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మి పథకం మహిళల ఆలయ దర్శనాలకు బాగా ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications