ఎన్నికల స్క్వాడ్ తనిఖీలతో మాజీ ఐఏఎస్ గోయల్ ఇంటివద్ద ఉద్రిక్తత!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అధికారులు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నా గుట్టు చప్పుడు కాకుండా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందని తెలుస్తుంది.
ఎన్నికల అధికారులు ఇప్పటికే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22 లోని మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేపట్టారు.

భారీగా డబ్బు అక్కడ డంపు చేశారన్న సమాచారం అందడంతో ఏకే గోయల్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు . ఏకే గోయల్ 2010లో పదవీ విరమణ పొందిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేశారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ కోసమే అక్కడ డబ్బులు దాచినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఏకే గోయల్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న క్రమంలో ఈ విషయం తెలియడంతో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకే గోయల్ ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. వారు కాంగ్రెస్ శ్రేణులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటి నుండి ఒక టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ విలువైన వస్తువులు తీసుకుని పోతున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు అతనిని అడ్డగించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరి ఈ సోదాలలో ఏం గుర్తించారు. ఆయన ఇంట్లో అధికారులు ఏం చేశారు అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications