• search
 • Live TV
ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మాజీ ఎంపీ దవాఖాన ధ్వంసం: కుమ్రంభీంకు అవమానం.. భగ్గుమన్న ఏజెన్సీ..

By Swetha Basvababu
|
  కుమురం భీం విగ్రహానికి చెప్పుల దండ : భగ్గుమన్న ఏజెన్సీ..!

  హైదరాబాద్/ ఆదిలాబాద్: ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, లంబాడీల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా భగ్గుమన్నది. శుక్రవారం ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. దీంతో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారింది. నార్నూర్‌ మండలం బేతాల్‌గూడలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో ఆదివాసీలు శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో బేతాళగూడకు చేరుకుని కుమురం భీం విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తర్వాత ఉట్నూరు సమీపంలోని హస్నాపూర్ గ్రామంలో ర్యాలీ చేపట్టారు. వీరికి పోటీగా లంబాడీలు ప్రదర్శన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. ఇదే సమయంలో ఉట్నూరు క్రాస్ రోడ్డువద్ద ఆదివాసీల జెండాలు తీసేయడంతో టెన్షన్ మరింత పెరిగింది.

  ఈ క్రమంలో ఒక వాహనం దూసుకెళ్లడంతో హస్నాపూర్ గ్రామ వాసులు రాథోడ్ జితేందర్, షేక్ ఫరూఖ్ (50) మరణించగా, జీ జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ర్యాలీ నిర్వహిస్తున్న ఆదివాసీ యువకులు ఇద్దరు ద్విచక్రవాహనం పైనుంచి పడి గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు.. లంబాడీలకు చెందిన 10 ద్విచక్ర వాహనాలు, మూడిళ్లు, ఒక కారు, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ ఆసుపత్రిని ధ్వంసం చేశారు.

  ఆందోళనకారులు దాడులు.. విధ్వంసం

  ఆందోళనకారులు దాడులు.. విధ్వంసం

  పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో లక్సెట్టిపేట ఎస్సై వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. పోలీసు వాహనాన్నీ ఆందోళనకారులు ధ్వంసం చేశారు. తర్వాత జైనూర్‌ మండల కేంద్రంలోని పెట్రోలు బంక్‌, మద్యం దుకాణాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. సిర్పూర్‌ (యూ) మండల కేంద్రం ఉన్న లంబాడీల ఆధ్యాత్మిక గురువు రామ్‌రావ్‌ మహరాజ్‌ విగ్రహానికి నిప్పు పెట్టారు. రెండు వర్గాల ఆందోళన నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడుతున్నాయి. అయినా ఇరువర్గాల వారు కర్రలతో ప్రధాన రహదారుల వెంట బీభత్సం సృష్టించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ ఆదివాసీలు ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు ఈ విషయం వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందడంతో ఏజెన్సీ అట్టుడికిపోయింది. నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌లో ఇరువర్గాలు రోడ్డుపైకి చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దుకాణాలు మూయించివేశారు. మరోవైపు గంగాపూర్, నార్నూర్, భీంపూర్‌ తదితర గ్రామాల్లో ఇరువర్గాల వారు కర్రలు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు.

  మూడు రోజుల పాటు 144 సెక్షన్

  మూడు రోజుల పాటు 144 సెక్షన్

  ఇరువర్గాల మధ్య గొడవల సెగ శుక్రవారం రాత్రికల్లా మారుమూల గ్రామాలకూ పాకింది. సిర్పూర్‌ (యూ) మండల కేంద్రంలో లంబాడీల రామారావు మహరాజ్‌ విగ్రహాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. లంబాడీలకు చెందిన పలు ఇళ్లపై దాడి చేశారు. దీంతో ఏజెన్సీలో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఓ గిరిజన తండాకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెస్తుండగానే, మరో తండాలో గొడవలు మొదలయ్యాయన్న సమాచారంతో పోలీసు బలగాలు ఉరుకులు పరుగులు తీశాయి. కానీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. దీంతో ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో మూడు రోజులపాటు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ఆదివాసీలు, లంబాడీలు శాంతించాలని విజ్ఞప్తి చేశారు.

  నల్లగొండ జిల్లాల్లో లంబాడీల నిరసన

  నల్లగొండ జిల్లాల్లో లంబాడీల నిరసన

  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం జిల్లాల పరిధిలో శనివారం బంద్‌కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. కుమురం భీం విగ్రహాన్ని అవమానించడాన్ని ఆదివాసీ హక్కుల పొరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ తదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నల్గొండ జిల్లాలోని దేవరకొండలో లంబాడీలు రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. నల్గొండ, మిర్యాలగూడ, నార్కట్‌పల్లిలో లంబాడాల ఆందోళనకు దిగారు. ఉట్నూరు ఘటనకు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

  దాడుల్లో ఎవరూ మరణించలేదని స్పష్టీకరణ

  దాడుల్లో ఎవరూ మరణించలేదని స్పష్టీకరణ

  ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, భారీగా బలగాలను రంగంలోకి దింపామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రెండు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) బలగాలను ఆ ప్రాంతాలకు తరలించామని ఒక ప్రకటనలో చెప్పారు. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు, అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముగ్గురు ఐజీ ర్యాంకు అధికారులు డీఎస్‌ చౌహాన్, అనిల్‌కుమార్, వై నాగిరెడ్డిలను పంపించామన్నారు. ప్రజాప్రతినిధులు కూడా నిగ్రహం పాటించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణల్లో పలువురు చనిపోయినట్లుగా సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని.. వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ ఘటనల్లో ఎవరూ మృతి చెందలేదని, నార్నూర్‌ మండలం హస్నాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం ఇద్దరు మాత్రం చనిపోయారని వివరించారు.

  ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఇలా నిరసన

  ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఇలా నిరసన

  ఆదివాసీలు లంబాడీల ఘర్షణతో ఆదిలాబాద్ అట్టుడుకుతోంది. దీని ప్రభావం హైదరాబాద్ నగరానికి తాకింది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర గిరిజన విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్‌ జిల్లాలో లంబాడీలపై దాడికి నిరసనగా నినాదాలతో ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ ఘర్షణకు నిరసనగా డీజీపీ కార్యాలయాన్ని లంబాడీలు ముట్టడించారు. ఆందోళన నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీజీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. డీజీపీ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎల్బీస్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుండటంతో వాటిపై ఈ ఆందోళన ప్రభావం చూపకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఉట్నూర్‌కు పొరుగు జిల్లాల అధికారులు ఇలా

  ఉట్నూర్‌కు పొరుగు జిల్లాల అధికారులు ఇలా

  ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణ, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు.. కరీంనగర్‌ డీఐజీ సి రవివర్మ శుక్రవారం సాయంత్రం ఉట్నూర్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు జ్యోతి బుద్ధప్రకాశ్, ఆర్వీ కర్ణన్, రామగుండం, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్లు విక్రంజిత్‌ దుగ్గల్, కమలాసన్‌రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల ఎస్పీలు కూడా ఉట్నూర్‌కు చేరుకుని భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గుడిపేట 13వ బెటాలియన్, డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌ బలగాలు ఉట్నూర్‌కు చేరుకున్నాయి. నిర్మల్, మంచిర్యాల, డిచ్‌పల్లి, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని రప్పించారు. శుక్రవారం రాత్రికే 600 మందికిపైగా పోలీసు బలగాలు మొహరించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని పోలీసు బలగాలు ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Adilabad district Utnoor Agency facing tensions between adivasis and lambadis. some unknown persons garlanded with footwear at Kumaram Bhim statue while this leads tension. Friday midnight expands other villages. DGP Mahender Reddy ordered to send additional forces to Utnoor Agency.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more