కామారెడ్డిలో ఉద్రిక్తత.. హైకోర్టును ఆశ్రయించిన రైతులు; కలెక్టరేట్ ముందు ఆందోళన!!
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ రచ్చగా మారుతుంది. నిన్న కామారెడ్డి బంద్ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వాతావరణం నేడు కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా కామారెడ్డి రైతులు తెలంగాణా హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. తమను అడక్కుండా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని తేల్చి చెప్తున్నారు.

కోర్టు మెట్లెక్కిన కామారెడ్డి రైతులు
హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో రైతుల పిటిషన్ ను హైకోర్టు సోమవారం నాడు విచారించనుంది. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం నాడు కూడా కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. మాస్టర్ ప్లాన్ ను మార్చాల్సిందేనని రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

నేడు కలెక్టరేట్ ముందు కామారెడ్డి రైతుల ధర్నా
నిన్నటికి నిన్న కామారెడ్డి బంద్ నిర్వహించిన రైతులు, నేడు కూడా కలెక్టరేట్ ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు, ఇప్పటివరకు ఇంతగా ఆందోళన చేస్తున్నా కలెక్టర్ ఎందుకు కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. రైతుల నిరసన నేపద్యంలో కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించి పర్యవేక్షిస్తున్నారు.

బండి సంజయ్ ఎంట్రీతో మరింత ఉద్రిక్తత
ఇదిలా ఉంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టరేట్ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి కామారెడ్డి కలెక్టరేట్ నుంచి కదిలేది లేదని ప్రకటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో బిజెపి కార్యకర్తలు పోలీస్ వాహనాల పై దాడి చేసి ధ్వంసం చేశారు.

రేవంత్ రెడ్డి పర్యటనపై టెన్షన్
ఇక బండి సంజయ్ ను, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు కామారెడ్డి లో పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్లూర్ ఎల్లారెడ్డి లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకోగా, నేడు రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. రేవంత్ రెడ్డి కూడా వస్తే కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications