పదవీ విరమణ పెంపు, బకాయిల చెల్లింపు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!?
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పైన ఫోకస్ చేసింది. ఉద్యోగ సంఘాల తో వరుసగా జరిగిన సమావేశాలు.. వారి డిమాండ్లను మంత్రివర్గ ఉప సంఘం కేబినెట్ కు సమర్పించనుంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీరి డిమాండ్ల పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. కాగా, ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఏడాది పెంపు ప్రతిపాదన పైన ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేసాయి. పెండింగ్ డీఏల విడుదల పైన చర్చ జరగ్గా.. ప్రభుత్వం ఒకటి లేదా రెండు డీఏ లకు నేటీ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
జేఏసీ ప్రతిపాదనలు
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కార పైన రోడ్ మ్యాప్ సిద్దం చేసింది. వరుసగా ఉద్యోగ సంఘాల నేతలతో జరిగన సమావేశంలో 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని, సప్లిమెంటరీ బిల్లులన్నీ ఒకే దఫాలో చెల్లించాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో వెంటనే మూడు డీఏలు విడుదల చేయాలని, మిగతా రెండింటిని పీఆర్సీలో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఉద్యోగు ల హెల్త్‌కార్డులు, సాధారణ బదిలీలు సహా తాము కోరుతున్న 57 అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. పదవీ విరమణ వయసు పెంచే ప్రతిపాదన ఏదైనా ఉంటే విరమించుకోవాలని కోరింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్లపై విస్తృతంగా చర్చించారు.

పరిష్కరించండి
ఉద్యోగుల డిమాండ్ల పైన తాము ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి, నివేదికను సిద్ధం చేశామని, ఉద్యోగుల డిమాండ్లను మంత్రివర్గ ఉప సంఘానికి వివరించామని నవీన్ మిట్టల్ ఈ భేటీలో వెల్లడించారు. మొదటి పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను అమలు చేశారే తప్ప, రెండో పీఆర్సీ మాటే ఎత్తడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వం లోని వేతన సవరణ సంఘానికి తాము పలు రకాల విజ్ఞప్తులు చేశామని వివరించారు. ముఖ్యంగా 51 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోందని, దీనిపై క్యాబినెట్ భేటీలో చర్చించి, ఆమోదించాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి రూ.13 వేలకోట్ల మేర సప్లిమెంటరీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రిటైర్మెంట్ ప్రయోజనా లను కూడా విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లు, గృహ నిర్మాణ బిల్లులను ఆపడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
నేటి భేటీలో
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని కోరారు. సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఏడాది పాటు పెంచుతామన్న వార్తలు వస్తున్నాయని.. దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగు తుందని, పదోన్నతులు పొందాల్సినవారు నష్టపోతారని వివరించారు. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఒకవేళ పదవీ విరమణ వయసు పెంచితే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. దీంతో, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచన లతో నివేదికను రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో నివేదిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సమస్యలకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు. దీంతో, ఉద్యోగ సంఘాల డిమాండ్ల లో కొన్నింటిని నేటి కేబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications