ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్ - కీలక నిర్ణయం..!!
తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ అర్ద్రరాత్రి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు నిర్ణయించాయి. సమ్మె నిర్ణయంలో మార్పు లేదని జేఏసీ నేతలు తేల్చి చెప్పాయి. సమ్మె మొదలైతే దాదాపు ఆరు వేల బస్సులు నిలిచి పోనున్నాయి. ఈ సమయంలో ఆర్టీసీ యాజమాన్యం సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది. అటు జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చల ప్రక్రియ కొనసాగించింది. జేఏసీతో ప్రభుత్వం చర్చల తరువాత సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ సంఘాల నేతలు ప్రకటించారు.
సమ్మె వాయిదా
తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకుల్లో ఆందోళనకు కారణమైన సమ్మె నిర్ణయం వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యల పైన అధ్యయనం.. ఉద్యోగ సంఘాలతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించింది. సభ్యులుగా నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో, ఆర్టీసీ జేఏసీ సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. కమిటీ చర్చల తరువాత మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు వెల్లడించారు.

ప్రభుత్వం నిర్ణయంతో
సమస్యలపై జేఏసీ చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. పలు సంఘాల నాయకులతో సమావేశం అనంతరం మంత్రి మట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు విని, పరిష్కరించేందుకు తనతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమ, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. 16 నెలల్లో ఆర్టీసీకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ. 400 కోట్లు చెల్లించామని చెప్పారు. పీఎఫ్ ఆర్టీనైజేసన్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 1039 కోట్లు చెల్లించామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు కొత్తగా 3038 ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పారు. సమ్మెకు పట్టుబడకుండా చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్మా హెచ్చరిక
సమ్మె మొదలైతే ఎస్మా తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది. ఎస్మా చట్ట ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని యాజమాన్యం ప్రకటించింది. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైనదని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించింది. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. కాగా, ఇప్పుడు జేఏసీ సమ్మె నిర్ణయం వాయిదా వేసుకోవటంతో ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్ దక్కింది.












Click it and Unblock the Notifications