Telangana: నేతన్నలకు రూ.200 కోట్లు బకాయి పడ్డ ప్రభుత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇన్ని రోజులు ఏపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని మీడియాలో తెగ ప్రచారం జరిగినా.. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందని ఇప్పటి వరకు తెలియదు. తెలంగాణకు ఇప్పటికే రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పున్నట్లు తెలుస్తోంది. దీనికి పాత ప్రభుత్వం పలు బకాయిలు చెల్లించలేదు. ఆ బకాయిలు కూడా ప్రస్తుతం ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది.
గత బతుకమ్మ చీరలకు సంబం ధించి సిరిసిల్ల నేతన్నలకు దాదాపు రూ.200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం బతుకమ్మ పం డుగకు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. వాటిని తయారు చేసిన నేతన్నలకు పూర్తి స్థాయిలో బిల్లులు ఇవ్వలేదు. ఆ బకాయిలు మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటాయని నేతన్నలు తెలిపారు. వీటితో పాటు 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి నూలు సబ్సిడీ కింద ఇవ్వాల్సిన దాదాపు రూ.20 కోట్లు కూడా పెండింగ్ లో పెట్టారని చెబుతున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమ బకాయిలు వస్తాయో లేదోనని నేతన్నలు భయపడుతున్నారు. అసలు వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా? ఉంటే ఆ ఆర్డర్లు తమకే ఇస్తారా? లేదా? అనేదానిపై కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలతో పాటు స్కూల్ యూనిఫామ్ క్లాత్ ఆర్డర్లు కూడా తమకే ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. 2014 లో 61,711 కోట్లు అప్పు ఉండగా.. 2015 మార్చి నాటికి రూ. 83,845 కోట్లకు చేరింది. 2016 మార్చి నాటికి రూ.1,29,531 కోట్లు, 2017 మార్చి నాటికి రూ.1,52,190 కోట్లు, 2018 మార్చి నాటికి రూ.1,75,281 కోట్లు, 2019 మార్చి నాటికి రూ. 2,05,858 కోట్లు, 2020 మార్చి నాటికి రూ. 2,44,019 కోట్లు, 2021 మార్చి నాటికి రూ. 2,88,452 కోట్లు, 2022 మార్చి నాటికి రూ. 3,22,993 కోట్లు 2023 మార్చి నాటికి రూ. 3,66,306 కోట్లు, 2023 డిసెంబరు ఫస్ట్ వీక్ నాటికి : 4,02,684 కోట్లు చేరుకున్నాయి. రెండు డిస్కంల అప్పులతో కలిపి తెలంగాణ మొత్తం రుణ భారం రూ. 5,81,356 కోట్లుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications