Darmapuri: ధర్మపురిలో రీకౌంటింగ్ జరగడం ఖాయమేనా..!
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ ను అధికారులు ఓపెన్ చేశారు. 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపించారు. రీ కౌంటింగ్ కోసం హైకోర్టును కోరారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్లు అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. లక్ష్మణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలని ఆదేశించింది.
ఎన్నికల ఫలితాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి.. అప్పటి ఎన్నికకు సంబంధించిన 17A,17 C డాక్యుమెంట్ కాపీలను, సీసీ పుటేజీ, ఎన్నికల ప్రొసీడింగ్స్ ను ఏప్రిల్ 11వ తేదీన సమర్పించాలని రిటర్నింగ్ అధికారి భిక్షపతికి హైకోర్టు స్పష్టం చేసింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మీన్ భాషతో పాటు స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలతో సుమారు 120 మంది ఆఫీసర్లు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ ను హైకోర్టుకు పంపనున్నారు. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. కొప్పుల తరపున డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.

అంతకు ముందు స్ట్రాంగ్ రూంకు సంబంధించిన తాళం చేతులే లేకపోవడంపై అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీని పై ప్రభుత్వం, మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్ కుమార్. రెండు తాళం చేతుల జతలు ఉండాలని, జిల్లా అడిషనల్ కలెక్టర్ కంట్రోల్ లో ఉండాల్సిన తాళం చేతులు మాయం కావడంతో స్ట్రాంగ్ రూం తాళాలను పగలగొట్టారు.












Click it and Unblock the Notifications