రాష్ట్రాన్ని సీఎం అప్పులపాలు చేసారు.!ప్రజల చేతిలో చిప్ప పెట్టారని కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్.!
హైదరాబాద్ : బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ కుమార్, టీఆర్ఎస్ నేతల మద్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మహా సంగ్రామ పాదయాత్ర రెండవ దశ ముగుంపుకు ఒక రోజు ముందు కూడా సీఎం చద్రశేఖర్ రావుపై బండి సంజయ్ విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాల్జేసి ప్రజల చేతికి చిప్ప ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి తలపై లక్షకుపైగా అప్పు భారం మోపారని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి చిప్ప చేతికిచ్చిన కేసీఆర్.. వినూత్న రీతిలో మండిపడ్డ బండి సంజయ్
ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేసారు. కరెంట్ ఛార్జీల పెంపుతో 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన చంద్రశేఖర్ రావు, ఆదాయం కోసం ప్రతి ఇంటిపై 500 నుండి వెయ్యి వరకు పన్ను వేసే రోజులు రాబోతున్నాయని హెచ్చరించారు బండి సంజయ్. రాష్ట్రంలో గిరిజన తండాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, పిల్లలను సాదలేక అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజన తండాలను అభవ్రుద్ది చేయడంతోపాటు ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

గిరిజనులను పట్టించుకోని మూర్ఖుడు కేసీఆర్.. అడవి బిడ్డల సంక్షేమాన్ని గాలికొదిలేసారన్న బండి
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 29వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మహేశ్వరం నియోజకవర్గంలోని దావూద్ గూడ తండావద్ద గ్రామస్తులతో ముచ్చటించారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. పేదలకు మోదీ ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తే వాటిని ఇవ్వకుండా పేదల నోటి ముద్దను లాక్కుంటున్నడన్నారు బండి సంజయ్. తండాల్లో పిల్లలను చదివించుకోలేక, అనేక ఆర్థిక సమస్యల్లో గిరిజనులు ఉన్నారని, బాల్య వివాహాలు చేస్తున్నరని, సీఎం హోదాలో చంద్రశేఖర్ రావు ఆదుకోకుండా గిరిజనుల గోస పుచ్చుతున్నడని మండి పడ్డారు.

గిరిజనుల జీవనం అగమ్యగోచరం.. సీఎం పట్టించుకోవడం లేదన్న బీజేపి ఛీఫ్
అంతే కాకుండా ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వని చంద్రశేఖర్ రావు ఊరికి 10 మద్యం దుకాణాలు తెరిచి తాగు-ఊగు పథకం పెట్టి తాగిస్తున్నడని, అమెరికాలో చప్రాసీ పనిచేసే కల్వకుంట్ల తారక రామారావు ఉద్యమం పేరుతో తెలంగాణకు వచ్చి మంత్రి పదవి సంపాదించిండాని తెలిపారు. తెలంగాణ కోసం 1400 మంది బలిదానాలు చేసిన యువకులంతా పేదలే, వారి త్యాగాలతో సాధించిన తెలంగాణను దోచుకుంటూ గుంట నక్కలాగా వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న నెంబర్ వన్ ద్రోహి చంద్రశేఖర్ రావు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

బీజేపీ కి ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రతి తండాలో సేవాలాల్ ఆలయం నిర్మిస్తామన్న బండి సంజయ్
పొలంకాడ కరెంట్ ఫ్రీగా ఇస్తున్నానని చెప్పి, ఇంటికాడ బిల్లుల మోత మోగించి ప్రజలపై భారం మోపిండని, డిస్కంలకు చంద్రశేఖర్ రావు 60 వేల కోట్ల బకాయిలున్నాడని, వాటిని చెల్లించకుండా ప్రజలపై మరింత భారం మోపుతున్నరని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖర్ రావు అప్పుల పాల్జేసిండని, ఒక్కో తలపై లక్షకు పైగా అప్పు భారాన్ని మోపిండని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాడి ధ్వజమెత్తారు. ప్రజల చేతికి చిప్ప నిచ్చిన చంద్రశేఖర్ రావు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే తట్టాబుట్టా సర్ధుకుని విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమైయ్యాడని ఘాటు విమర్శలు చేసారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని, తండాలలో సేవాలాల్ ఆలయం కావాలంటే బీజేపీని గెలిపించలాని, గిరిజనులంతా ఏకమై గడపగడపకూ వెళ్లి చంద్రశేఖర్ రావును గద్దె దించేలా ప్రచారం చేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేసారు.