"కోటి" భక్త జన సందోహం - నేటితో మేడారం జాతర ముగింపు : గవర్నర్ రాక..!!
ఎటు చూసిన జనం. అన్ని వైపులా జన ప్రభంజనం. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు కోటి మంది భక్తులు తరలి వచ్చినట్లుగా అంచనా. సాధారణ భక్తులు మొదలు మంత్రులు..పలువురు ప్రముఖులు అమ్మల దర్శనం కోసం చేరుకున్నారు. నేటితో మేడారం జాతర ముగియనుంది. ఈ సాయంత్రం 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అమ్మవార్ల వన ప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. చివరిరోజు అమ్మవార్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకోనున్నారు.

కోటి మందికి పైగా దర్శనం
టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మేడారం రానున్నారు. గట్టమ్మ వద్ద నుంచి ర్యాలీగా మేడారం వచ్చేందుకు 200 వాహనాలను కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. ఈ సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై వేంచేసినాకే మొక్కులు చెల్లించాలనే సెంటిమెంట్‌తో వేచి ఉన్న భక్తులంతా సమ్మక్క గద్దెపైకి వచ్చిన తర్వాత దర్శనానికి ఒక్కసారిగా కదిలారు.
దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఒత్తిడి పెరిగింది. దీంతో క్యూలో నిల్చున్నవారిలో కొందరు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇద్దరు స్పృహ తప్పిపడిపోయారు. పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగు నిండి పోయింది.

సంప్రదాయ బద్దంగా జాతర
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు వారి సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలను పూజించుకున్నారు. ఇక, ఇవాళ సమ్మక్కను చిలకల గుట్టపైకి తిరిగి తీసుకువెళ్లడం ద్వారా వనప్రవేశం చేయిస్తారు. సీఎం కేసీఆర్ మేడారం పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు.
ఆయన వస్తారని హెలీప్యాడ్‌ను సిద్ధం చేయడంతోపాటు రోప్ పార్టీతో మాక్‌డ్రిల్ నిర్వహించి సీఎం కోసం నిరీక్షించారు. అయినప్పటికీ సీఎంవో నుంచి సమాచారం రాకపోవడంతో.. ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ శ్రేణులంతా సాయంత్రం 4 గంటల వరకు ఎదురుచూసి నిరాశతో తిరుగుముఖం పట్టారు. శనివారం ఆయన మేడారానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నేటితో ముగింపు..అమ్మవార్ల వన ప్రవేశం
జాతరకు శుక్రవారం ప్రముఖుల తాకిడి పెరిగింది. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరై తల్లులను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. మేడారం గద్దెల ప్రాంగణంలో ఎమ్మెల్యే సీతక్క సందడి చేశారు. 'పచ్చని ఆడవుల్లో.. విచ్చుకున్న కొమ్ముల్లో.. కొలువు దీరిన సమ్మక్క సారలమ్మ తల్లీ' అంటూ పాడి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. సారలమ్మ వచ్చే రోజు పాడాలని అనుకున్నప్పటికీ సమయం అనుకూలించలేదని, అందుకే పాడానని తెలిపారు.












Click it and Unblock the Notifications