పట్టపగలు హైదరాబాదులో బీభత్సం, హత్య: ఇంటి దొంగలేనా?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రామంతాపూర్‌లో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. బాతురూంలో స్నానం చేస్తున్న వృద్ధురాలును హత్యచేసి ఇంట్లో ఆల్మారాలో ఉన్న రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లారు.
పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ న్యూగోఖులేనగర్‌లో నివసిస్తున్న దొరశెట్టి కోటప్ప భార్య వీరమణి (80)కు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు చంద్రశేఖర్‌తో కల్సి జీవిస్తోంది.
మంగళవారం ఉదయం కుమారుడు డ్యూటీకి వెళ్లగా, మధ్యాహ్నం 12గంటలకు కోడలు భార్గవి పిల్లలను తీసుకరావడానికి స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చేలోగా స్నానం కోసం బాతురూంలో ఉన్న వీరమణిని గుర్తుతెలియని దుండగలు ఇనుప నల్లాకు బాది హత్య చేశారు.

ఇంట్లోని ఆల్మారాలో ఉన్న వస్తువులను చిందర వందర చేశారు. 10 తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులకు కోడలు భార్గవి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మల్కాజిగిరి ఏసిపి రవిచంధన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నర్సింహారెడ్డి, వెంకట రంగారెడ్డి, ఎస్‌ఐలు రవి, కిరణ్, క్రైం పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. జరిగిన హత్య తీరు పలు అనుమానాలకు దారితీస్తుంది.
రామంతాపూర్‌లో పట్టపగలు వృద్థురాలి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో ఉన్న కోడలు బయటకు వెళ్లి వచ్చేలోగా కేవలం 15 నిమిషాల్లోనే దొంగలు వచ్చి ఎలా దోచుకెళ్తారు? దొంగతనం కోసం వస్తే చేతగాని పండు ముసలి అయిన వృద్థురాలిని ఎందుకు హత్య చేస్తారని పోలీసుల్లో అనుమానం వ్యక్తమవుతోంది.
ఇంట్లో అద్దెకు ఉన్న యువకులతో కలిసి హత్య చేసి ఉండవచ్చని సమాచారం. రంగంలోకి దిగిన డాగ్‌స్క్వాడ్ ఇళ్లంతా తిరిగి కోడలు భార్గవి వద్దనే నిల్చొని వాసన చూడటం, చేతికి గాయం ఉండటంతో ఆమెపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడలు భార్గవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications