నిరుద్యోగుల ఉసురుతో ఈ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!!
నిరుద్యోగ యువత ప్రవళిక ఆత్మహత్య తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. గ్రూప్2 పరీక్షలు వాయిదా పడిన కారణంతో మనస్తాపం చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పాపం కేసీఆర్ ప్రభుత్వానిదేనని విరుచుకు పడుతున్నాయి.
తాజాగా ప్రవళిక ఆత్మహత్య నేపథ్యంలో నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ పిలుపునిచ్చారు. నిరుద్యోగులారా బతికి సాధిద్దాం .. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే అని పేర్కొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడుపు నిండా ఉద్యోగాలు ఇచ్చుకుందాం అని పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతకు చేతులెత్తి మొక్కుతున్నా అన్న ఆయన, ఎవరు కన్న తల్లిదండ్రులకు కడుపు శోకం మిగల్చకూడదని పేర్కొన్నారు. గ్రూప్ 2 వాయిదాతో వరంగల్ కి చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపిన ఆయన ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే అని మండిపడ్డారు. ప్రవళిక ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నానని, నాలుగు కోట్ల ప్రజలు కూడా ఆత్మహత్యలు ఖండించాలని పేర్కొన్నారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చనిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.పదేళ్లలో ఒక్క గ్రూప్ పరీక్ష నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు అంటూ ఎద్దేవా చేశారు.
నీళ్లు, నిధులు,నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఉద్యోగాల కోసం చచ్చిపోతున్నారన్నారు. ఉద్యోగాల కోసం యువకులు పిచ్చోళ్ళలాగా తిరుగుతూ కుటుంబాలకు దూరం అవుతున్నారన్నారు. నిరుద్యోగులు ఉసురు తగిలి ఈ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగులారా రెండు నెలలు ఓపిక పట్టండి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా ఇస్తామని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.












Click it and Unblock the Notifications