ఇదే రిపీట్ అవుద్ది: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజయంపై బండి సంజయ్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంచి జోష్ తో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ ఎన్నికలకు దారి చూపించాయన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్మం వైపు నిలిచారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఇదే సీన్ రిపీట్ అవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించటం టీచర్లలో పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి టీచర్ల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాబోయే సాధారణ ఎన్నికలలోను ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు తమకు అందించారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

నియంతృత్వ, నియంత పోకడలకు పోయే బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయ లోకం, ఉపాధ్యాయ వ్యతిరేక కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తమ వెంట నడుస్తారని ఆశిస్తున్నామన్నారు బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఏవీఎన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. బిజెపిపై మీరు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, టీచర్ల సమస్యల పరిష్కారానికి మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని, అందుకు ఈ విజయం ప్రేరణనిస్తుందని బండి సంజయ్ వెల్లడించారు.

ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన కారణంగా గెలిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డికి, బండి సంజయ్ కు, బిజెపి కార్యకర్తలకు అమిత్ షా, జెపి నడ్డా అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇదే కోరుకుంటున్నారు అంటూ అవినీతితో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఈ విజయమే నిదర్శనమని అమిత్ షా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications