బుల్‌డోజర్లను తెప్పిస్తున్నాం: యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకపోతే తరిమి కొడతాం: రాజాసింగ్
హైదరాబాద్: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో రెండోదశతో పాటు గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఈ నెల 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో మిగిలిన దశల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. పంజాబ్, మణిపూర్‌లల్లోనూ పోలింగ్ ముగుస్తుంది. 20వ తేదీన ఉత్తర ప్రదేశ్ మూడోదశతో పాటు పంజాబ్‌లో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

బీజేపీలో ఆందోళన..
23, 27 తేదీల్లో మణిపూర్‌లో ఎన్నికలు ఉంటాయి. 3, 7 తేదీల్లో యూపీ చివరి రెండు విడతల పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ నెల 10, 14వ తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్ ట్రెండ్.. భారతీయ జనతా పార్టీకి నిరాశను మిగిల్చిందనే అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యక్తమౌతోన్నాయి. పోలింగ్ శాతం తగ్గడం, బీజేపీకి పట్టులేని నియోజకవర్గాల్లో పెరగడం బీజేపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోన్నట్లుగా భావిస్తున్నారు విశ్లేషకులు.

నిరాశకు గురి చేసిందా?
మిగిలిన దశల్లో పోలింగ్ ఊపందుకోవడంపై బీజేపీ విజయం ఆధారపడి ఉండొచ్చని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీకే చెందిన తెలంగాణ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో తొలి రెండుదశల్లో నమోదైన పోలింగ్ ట్రెండ్.. నిరాశకు గురి చేసిందనే అభిప్రాయం ఆయన వ్యాఖ్యానాల్లో స్పష్టమైంది. ఉత్తర ప్రదేశ్‌లో నివసించాలంటే బీజేపీకి ఓటు వేయక తప్పదంటూ టీ రాజాసింగ్ హెచ్చరించారు.

అలాంటి వారికి చోటు లేదు..
యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయనకు ఓటు వేయని ద్రోహులకు ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదని స్పష్టం చేశారు. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని, వాటిని తెప్పిస్తున్నారని చెప్పారు. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? అని ప్రశ్నించారు.

యోగిని ఇష్టపడని ప్రాంతాల్లో భారీ పోలింగ్..
యోగి ఆదిత్యనాథ్‌ను ఇష్టపడని ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైందని టీ రాజాసింగ్ గుర్తు చేశారు. యోగిని ముఖ్యమంత్రిగా అంగీకరించని వారు ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి..తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి హిందు బంధువులందరూ మిగిలిన అయిదు దశల్లో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.

మూడోదశ కోసం పోటెత్తాలి..
మూడోదశ పోలింగ్ సందర్భంగా హిందువులందరూ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత.. యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయని వారిని గుర్తిస్తామని, వారిని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. దీనికోసం బుల్‌డోజర్లు, జేసీబీలను యోగి తెప్పిస్తున్నారని, అవి బయలుదేరాయని కూడా రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ నేతల్లో ఈ అసహనానికి కారణం- తొలి రెండు దశల్లో పోలింగ్ ట్రెండ్.. బీజేపీకి వ్యతిరేకంగా ఉందనే సంకేతాలను పంపించినట్టయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications