వచ్చే ఎన్నికల్లో మోడీకి ఓటు వేయకుంటే దేశద్రోహులే: ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేయకపోతే దేశద్రోహులే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిన్న కోరుట్లలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో మళ్ళీ బిజెపి విజయ డంకా మోగిస్తుందని, అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని, లోక్సభ ఎన్నికలలో పక్కాగా బిజెపి 70 సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. బిజెపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రగతి సాధ్యమైందని, గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని అభివృద్ధిని, చేయలేని ప్రగతిని, తీసుకురాలేని ప్రపంచ గుర్తింపును 10 సంవత్సరాల లోనే ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారని పేర్కొన్నారు.

దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఇండియా కూటమి నుంచి పార్టీలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మోసం చేసిందని పేర్కొన్న అరవింద్, రైతు సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయలు ఇచ్చినట్టు వెల్లడించారు. ఇక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని పేర్కొన్న ఆయన, నారీ శక్తి బీజేపీ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. 7 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని చెప్పుకొచ్చారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని, దీనిపై రేవంత్ రెడ్డికి స్పష్టత కొరవడింది అని మండిపడ్డారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇచ్చిన ఘనత బిజెపి దని గత రెండేళ్లుగా పసుపు రైతులకు మేలు చేసేలా స్పైసెస్ బోర్డు, పసుపు బోర్డు పనిచేస్తున్నాయని గుర్తు చేస్తారు. ప్రధాని మోడీ చెరువులతో పసుపు రైతులకు మేలు చేకూరుతుందని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications