ప్రాయశ్చిత్తమయం- చిల్కూర్ టెంపుల్‌లో..!!
Chilkur Balaji temple: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు.

దీని తరువాత- జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు స్వరూపమైన శ్రీవేంకటేశ్వరస్వామివారికి నైవేద్యంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూలను పెట్టారని, దానికి తాను ప్రాయశ్చిత్తం చేస్తోన్నాననీ చెప్పారు.
అదే సమయంలో హైదరాబాద్ శివార్లలోని చిల్కూర్ బాలాజీ ఆలయంలో అర్చకులు ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు. ఈ తెల్లవారుజామున తడిబట్టలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయం ముందు ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛారణ జరిపారు. అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అంటూ నినదించారు.
చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్.. ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. తాము చేసే పూజల్లో ఎలాంటి లోపాలు ఉన్నా తమను కరుణించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం మంత్రోచ్ఛారణలతో మార్మోగింది. వందల సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications