పాక్ తో చర్చిస్తారు కానీ మావోల్ని చంపుతారా ? కేంద్రంపై ఆర్. నారాయణ మూర్తి ఫైర్..!
కేంద్రం ఇటీవల చేపట్టిన రెండు కీలక ఆపరేషన్లు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్ ను పోలుస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతున్నాయి. చర్చలకు సిద్దమని చెప్తున్న మావోయిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో చంపుతున్న కేంద్ర ప్రభుత్వం.. నిత్యం సాధారణ పౌరుల ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ను ఆపేసి చర్చలు జరుపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై టాలీవుడ్ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసారు.
ట్రంప్ ఆపమన్నాడనో, పాకిస్తానోడు చర్చలు జరిపాడనో యుద్ధం ఆపిన మీరు.. ఆపరేషన్ కగార్ ఆపండి శాంతి చర్చలు జరపడానికి సిద్ధం అని చెబుతున్న మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారని ఆర్ నారాయణ మూర్తి ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి కేంద్రం తీరుపై ఫైర్ అయ్యారు.

హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే కర్మకాండ జరుపుతారని, అలాంటిది ఆపరేషన్ కగార్ లో చనిపోయిన వాళ్ళని వారి కుటుంబసభ్యులకు చూపించకుండా వారి చేతులతో కర్మకాండ జరిపించకుండా చేస్తున్న మీరు ఏం హిందువులు, మీదేం హిందూ పార్టీ ? అంటూ బీజేపీపైనా ఆర్ నారాయణమూర్తి ఫైర్ అయ్యారు. దేశ సంపద దేశ మూలవాసులకే చెందాలంటూ పోరాటం చేస్తున్న మావోయిస్టుల్ని చర్చలకు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్ కగార్ పేరుతో చంపడం అన్యాయం అన్నారు.

ట్రాంప్ ఆపమన్నాడనో, పాకిస్తానోడు చర్చలు జరిపాడనో యుద్ధం ఆపిన మీరు.
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) June 6, 2025
ఆపరేషన్ కగార్ ఆపండి శాంతి చర్చలు జరపడానికి సిద్ధం అని చెబుతున్న మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారు?
హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే కర్మకాండ జరుపుతారు అలాంటిది ఆపరేషన్ కగార్ లో చనిపోయిన వాళ్ళని వారి… pic.twitter.com/4BRdp6ZdcN
తల్లితండ్రుల్నీ, ఇల్లూ వాకిలిని వదులుకుని, ప్రాణభయం లేకుండా పోరాటాలు చేస్తున్న మావోయిస్టుల్ని కేంద్రం ఇలా దారుణంగా చంపడం ఏం న్యాయమని ఆర్ నారాయణ మూర్తి ప్రశ్నించారు. దాయాది దేశం పాకిస్తాన్ తో చర్చలు జరిపిన మీరు.. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్న ఈ దేశ వాసుల్ని చంపడం ఏంటన్నారు. ఆకలి ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం అడవిలో ఉన్నవారు ఆల్ రైట్ అని ఆయన తెలిపారు. హిందువుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న వారు చనిపోయిన వారి కర్మకాండలు జరుపుకోవడానికి కూడా మృతదేహాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications