టమాటాల దొంగలు: కూరగాయల మార్కెట్ లో టమాటాలు, పచ్చిమిర్చి చోరీ!!
టమాట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా టమాట ధరలు 160 రూపాయల ధర వరకు విక్రయం అవుతున్నాయి. ఊహకు అందని విధంగా టమాటాల ధరలు ఒక్క నెలరోజుల్లోనే కొండెక్కి కూర్చున్నాయి. టమాటాలతో పాటు పచ్చిమిర్చి ధరల మంట కూడా సామాన్యుల నషాళానికి తాకుతుంది.
నెల రోజుల వ్యవధిలో టమాట ధరలు నియంత్రణలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం టమాటాలను కొనుగోలు చేయాలంటే ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో టమాటా ధరల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. ఏపీ వంటి రాష్ట్రాల్లో సబ్సిడీ మీద టమాటాలను అందిస్తున్నారు. టమాటాలు లేకుండా వంట చెయ్యటానికి ఇళ్ళలో ఆడవాళ్ళు పడరాని కష్టాలు పడుతున్నారు.

వంట గదిలో నిత్యం అవసరమయ్యే టమాటాలు, పచ్చిమిరపకాయలు విపరీతంగా ధరలు పెరిగిన వేళ విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పంట పొలాల్లో టమాటాలను చోరీ చేయడం మాత్రమే కాకుండా, ఆఖరికి కూరగాయల మార్కెట్ లోనూ టమాటాలను దొంగలు వదిలిపెట్టడం లేదు. తాజాగా అటువంటి ఘటనే జిల్లా డోర్నకల్ మండలం లోని కూరగాయల మార్కెట్ లో చోటు చేసుకుంది.
మహబూబాద్ జిల్లా డోర్నకల్ గాంధీ సెంటర్ లోని కూరగాయల మార్కెట్ లో రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలిక నెట్ లను ఏర్పాటు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా రాత్రి వేళల్లో కూరగాయలు చోరీకి గురవుతున్నాయి. పలు దుకాణాల్లో ముఖ్యంగా టమాటాలు, పచ్చిమిర్చి చోరీ చేస్తున్నారు. ముఖ్యంగా దుండగులు దుండగులు టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డ వంటి ధరలు ఎక్కువగా ఉన్న కూరగాయలను దొంగతనం చేస్తూ ఉండడం కనిపిస్తుంది.
వరుస దొంగతనాల నేపథ్యంలో కూరగాయల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. డోర్నకల్ కూరగాయల మార్కెట్ లో వాచ్ మెన్ లేకపోవడంతో టమాటాలు చోరీకి గురవుతున్నాయని వారు వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిన నేపథ్యంలో కూరగాయల దొంగతనం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి వేళ ముఖ్యంగా టమాటాలు, పచ్చి మిరపకాయలకు కాపలా కాసుకోవాల్సిన పరిస్థితి కూరగాయల వ్యాపారులకు వచ్చింది.












Click it and Unblock the Notifications