వివేక్ తో రేవంత్ భేటీ, తాజా ఆఫర్ - మహిళా నేత సైతం..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ లో నేతల చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ముఖ్యులను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇందులో భాగంగా మాజీ ఎంపీ..బీజేపీ నేత వివేక్ తో నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో బీజేపీలో కొనసాగుతున్న మరో ముఖ్య మహిళా నేతతోనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఏ ఒక్క అవకాశం వదులుకొనేందుకు కాంగ్రెస్ సిద్దంగా లేదు. ఇతర పార్టీల నుంచే వచ్చే ముఖ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో కాంగ్రెస్ లో పని చేసి పార్టీ వీడిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ముఖ్య నేతలు రంగంలోకి దిగారు.

కాంగ్రెస్ నుంచి ఎంపీగా వ్యవహరించి..తరువాతి పరిణామాల్లో బీజేపీలో చేరిన వివేక్ వెంకట స్వామితో టీపీసీసీ చీఫ్ రేవంత్ సమావేశం అయ్యారు. తాజా రాజకీయాలపైన చర్చించారు. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని..ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్దుల జాబితా దాదాపుగా పూర్తి అయింది. దీంతో, కాంగ్రెస్ ఎంపీగా వివేక్ పోటీ చేయాలని రేవంత్ కోరినట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు మునుగోడు సీటు ఖాయం చేసారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వివేక్ తో పాటుగా బీజేపీలో కీలకంగా ఉన్న మరో మహిళా నేతతోనూ చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం తాను బీజేపీకి రాజీనామా చేయటం లేదని వివేక్ స్పష్టం చేసారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగానే పెద్దపల్లి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అపాయిమెంట్ ఇవ్వడం, స్వయంగా కలుసుకోవడం చర్చలు జరపడం ఈ పరిణామాలు పార్టీ మారుతాయి అన్న వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీలో చేరికల జోష్ కొనసాగించేలా కాంగ్రెస్ నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో, ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications