‘ఈ- నామ్’కు పంగనామాలు ఇలా? రైతుకు శఠగోపం: మార్కెట్‌లో నేడు ధర రూ.9900.. హరీశ్ జీ! ఏమంటారు?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రైతులకు శఠగోపం పెట్టడంలో ప్రభుత్వాల తర్వాతే ఎవరైనా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రైతు పండించిన పంటకు ధర నిర్ణయించే విషయంలోనూ ఆ పంట భూమిలో ఇతర వనరులకు ధర నిర్ణయం విషయంలో మార్కెట్ వర్గాలు, ప్రభుత్వ శాఖలదే చెల్లుబాటవుతున్న నేపథ్యం కనిపిస్తున్నది. ప్రత్యేకించి మిర్చి, పత్తి పంటల ధరలకు వ్యాపారులే ధర నిర్ణయిస్తూ ఉన్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రతి సీజన్‌లో పదేపదే ప్రకటించే 'ఈ- నామ్' పాలసీ కీలక సమయంలో అమలు చేసిన వారే కరువయ్యారు.

ఇక పంట పొలాల వెంబడి వాగులు వంకలతో వచ్చే ఇసుకకు క్యూబిక్ మీటర్ కు రూ.100 చొప్పున రైతుకు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వినియోగదారులకు రూ.500లకు విక్రయిస్తున్నది. బయటకు మాత్రం తమ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పని చేస్తున్నదని పదేపదే ప్రకటనలతో ఊదరగొడుతున్నది.

వ్యాపారుల పంట పండుతోంది ఇలా

వ్యాపారుల పంట పండుతోంది ఇలా

ఏడాది పొడవునా సాగు చేసి పండించి మార్కెట్ తీసుకొచ్చిన మిర్చి రైతుకు కనీసం రవాణా చార్జీలు కూడా రాలేదు. సాగుకు ముందు క్వింటాల్‌ మిర్చి రూ.13,500 ఉంటే.. తీరా పంట రైతు చేతికొచ్చాక రూ.2500కి పడిపోయింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్నదాతను నిలువునా ముంచేశారు. మార్కెట్ లో అధికార వర్గాలు, వ్యాపారుల సిండికేట్ రాజకీయం తీరుతో ఆగ్రహించిన అన్నదాత ఆందోళన బాట పట్టారు. కానీ సర్కార్ కనికరం చూపకుండా వ్యాపారులకే వత్తాసు పలికేలా వ్యవహరించింది. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టింది. హైదరాబాద్, వరంగల్ జిల్లాలోనూ ఆందోళన బాట పట్టిన రైతులను అరెస్టులు చేసి, పరిస్థితిని దాట వేసిన ఘనత సర్కార్ వారిదే. కానీ అదే వ్యాపారులు రైతుల నుంచి కారు చౌకగా కొన్న పంటను వారి పేరు మీదే గోదాముల్లోనే నిల్వ చేసి, ఇప్పుడు క్వింటాల్‌ రూ.9900కు అమ్ముకుంటున్నారు.

 ‘ఈ - నామ్’ పద్దతిలో కొనకుండా వ్యాపారుల ఆటంకాలు ఇలా

‘ఈ - నామ్’ పద్దతిలో కొనకుండా వ్యాపారుల ఆటంకాలు ఇలా

గతేడాది ఖమ్మం జిల్లాలో28.5 వేల హెక్టార్లలో (71,250ఎకరాలు), భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలో 23.5 వేల హెక్టార్ల (58,750 ఎకరాలు)లో మిర్చి సాగుచేశారు. ఎకరానికి రూ.1.20లక్షలు ఖర్చు చేశారు. ఎకరానికి 20 క్వింటాళ్ల చొప్పున ఖమ్మం జిల్లాలో 14.25 లక్షల క్వింటాళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11.75 లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. పంటను సీజన్‌లో రైతులు భారీగా మార్కెట్‌కు తెచ్చారు. ఇదే అదనుగా వ్యాపారులు, మార్కెట్‌ అధికారులు కూడ బల్కుని మరీ ధర తగ్గించేశారు. మే నెలలో 4,20,868 క్వింటాళ్లు, జూన్‌లో 1,99,090క్వింటాళ్లు, జులైలో 1,40,206 క్వింటాళ్లు, ఆగస్టులో 83,981క్వింటాళ్ల మిర్చి పంట ఖమ్మం మార్కెట్‌కు వచ్చింది. సెప్టెంబర్‌లో 45,238 క్వింటాళ్లు, అక్టోబర్‌లో 31,094 క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు వచ్చింది. ఈ సమయంలో వ్యాపారులు రైతుల పంటను ఈ - నామ్‌ పద్ధతిలో కొనుగోలు చేయకుండా అడ్డుకుని తమ ఇష్టారీతిన ధరలు నిర్ణయించారు. రూ.4000 నుంచి రూ.2500 వరకు కొన్నారు. అత్యధికంగా రూ.2500 లోపే కొనుగోలు చేశారు. ఇప్పుడు ధర అమాంతం పెరిగింది.

కేంద్రం ఆదేశాలు బేఖాతర్

కేంద్రం ఆదేశాలు బేఖాతర్

మే నెలలో ఖమ్మం జిల్లాలో మిర్చి ధరకు రేటు పడిపోవడంతో కేంద్రం క్వింటాల్‌కు కనీసం రూ.5000కు తగ్గకుండా ధర చెల్లించాలని తెలంగాణ సర్కార్‌కు సూచించింది. అయినా పట్టించుకోని సర్కారు రైతుల పంటను వ్యాపారులు అతితక్కువ ధరకు కొనుగోలు చేసినా స్పందించిన దాఖలాలు లేవు. కొందరు రైతులు మార్కెట్‌కు తీసుకొస్తే రవాణా చార్జీలుకూడా రావడం లేదని కళ్లాల్లోనే పారబోస్తే మరికొందరు తగలబెట్టారు. అగ్గువకు కొన్న వ్యాపారులు పంటను ఏసీ గోదాముల్లో నిల్వ చేసి ఇప్పుడు క్వింటాల్‌ రూ.9900 చొప్పున అమ్ముకుంటున్నారు.

ఆచరణలో ‘ఈ- నామ్’కు పంగ నామాలు ఇలా

ఆచరణలో ‘ఈ- నామ్’కు పంగ నామాలు ఇలా

ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల్లో 42 గోదాములు ఉన్నాయి. వీటిలో నిల్వ సామర్థ్యం 28 లక్షల బస్తాలుకాగా, అందులో నిల్వ ఉన్నది ఎక్కువ భాగం వ్యాపారులదేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే రైతులు పండించిన పంటలు గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చునని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు పదేపదే చెప్తుంటారు.. ఈ - నామ్ పద్దతుల్లో పంటలు కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నా.. ఆచరణలో జరుగుతున్నది అందుకు విరుద్ధమని వాస్తవ పరిస్థితులు చెప్తున్నాయి.

ఎవరైనా అమ్ముకోవచ్చునని నేడు ముక్తాయింపు

ఎవరైనా అమ్ముకోవచ్చునని నేడు ముక్తాయింపు

నాడు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యాపారులు మోసగిస్తున్నారని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. కడుపుమండి ఆందోళన చేసిన రైతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టిందని, అప్పుడు రైతుల దగ్గర కారుచౌకగా కొన్న వ్యాపారులు ఏసీ గోదామముల్లో నిల్వ చేసుకుని ఇప్పుడు క్వింటాల్‌ రూ.9900కు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఆర్ సంతోష్ కుమార్ స్పందిస్తూ ఖమ్మం మార్కెట్‌లో క్వింటా మిర్చి రూ.9900 పలుకుతోందని వ్యాపారులు, రైతులు.. ఎవరైనా అమ్ముకునే వీలుందని చెప్పారు. మార్కెట్‌కు వస్తున్న సరుకు వ్యాపారులదా, రైతులదా అనేది పరిగణించలేమని ఏసీ మిర్చికి మాత్రమే ధర బాగా పలుకుతోందని చెప్పుకొచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mirchi farmers cheated by traders in agricultural markets. Traders are formed Syndicate from May onwards and they paid quintal for Rs.2500. They didn't bothered about Union Government advise to pay Rs.5000 per quintal. Today traders sells mirchi per quintal Rs.9999.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి