• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గైడ్‌లైన్స్ బేఖాతర్: పాత ధరలకే పప్పులు.. యదేచ్ఛగా జీరో దందా

By Swetha Basvababu
|

హైదరాబాద్: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చాక పన్ను చెల్లింపుల్లో ఎటువంటి అక్రమాలకు తావు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాని నరేంద్రమోదీ పదేపదే చెప్తూ వచ్చారు. కొత్త చట్టం అమలులోకి వచ్చి రెండు నెలలు పూర్తయినా స్పష్టత కొరవడింది. దీన్నే అదనుగా చేసుకున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారు.

ఏ వస్తువులకు పెరిగిన జీఎస్టీ ఎంత? అన్న విషయమై పూర్తిస్థాయి అవగాహన లేక, అందినకాడికి దండుకుంటున్నారు. పన్ను తగ్గిన వాటికి పాత బిల్లులు వేస్తున్న వ్యాపారులు, పెరిగిన వాటికి మాత్రమే కొత్త బిల్లులు వేస్తున్నారని తెలుస్తున్నది. కొన్ని చోట్ల పన్ను తగ్గిన వస్తువులకు పెరిగిందని చెప్పి, తమ వద్దకు వచ్చే వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఆహార ఉత్పత్తులపై, ప్రత్యేకించి పప్పులపై పన్నును పూర్తిగా మినహాయించింది. పప్పులపై పన్నులను కేంద్రం పూర్తిగా ఎత్తివేయగా ఆ ఫలాలు వినియోగదారులకు చేరడం లేదు. జీఎస్టీ అమల్లోకి రాకముందు రాష్ట్ర పరిధిలో వరకు 5 శాతం, ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తే 2 శాతం, మర్కెట్‌ కమిటీకి చెల్లించాల్సిన పీజు 1శాతం చొప్పున ఉండేది.

మార్కెట్‌ కమిటీకి చెల్లించాల్సిన ఒక శాతం ఫీజు తప్ప ఇతర పన్నులు పూర్తిగా మినహాయించారు. అయినా పప్పుదినుసుల ధరలు దిగిరాక మధ్యతరగతి వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. పప్పుదినుసులతో పాటు పలు ఆహార ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను(జీఎస్టీ) మినహాయించినా ధరలు దిగిరాకపోవడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పైగా వ్యాపారులు అదనంగా జీఎస్టీ పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. జులై నెలలోనే పన్ను మినహాయించిన వాటి ధరలు ఇంకా పాతవే అమలులో ఉన్నాయ. పెసర పప్పు కిలోకు రూ.75 - 80, కంది పప్పు రూ. 78 - 83 పలుకుతోంది. రోజువారీగా ఒక కామారెడ్డి జిల్లా పరిధిలోని కందిపప్పు 15 వేల క్వింటాళ్లు, పెసర పప్పు 10 వేల క్వింటాళ్లు వినియోగిస్తున్నారు.

 రైతుల పంటలపై సిండికేట్ దోపిడీ ఇలా

రైతుల పంటలపై సిండికేట్ దోపిడీ ఇలా

ఇతర ప్రాంతాలకు పప్పులను ఎగుమతి చేయడంలోనూ కామారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకూ ఎక్కువగా ఎగుమతి చేస్తున్నది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నుంచి పప్పుదినుసులు ఎక్కువగా ఇక్కడకు దిగుమతి అవుతాయి. ఇక్కడి నుంచి కంది, పెసర పప్పులను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. జీఎస్టీ అమలు తర్వాత పన్నులను తొలగించడంతో గతంలో విక్రయించిన దానికన్నా తక్కువ ధరకు పప్పులను విక్రయించాలి. కానీ గతంలోనూ ఇప్పుడూ హోల్‌సేల్‌ మార్కెట్లో కంది పెసర పప్పు కిలో రూ.65-75 చొప్పున విక్రయిస్తున్నారు. చిరువ్యాపారులు రూ. 80-85 చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా రోజుకు రెండు లారీల కందిపప్పు వినియోగం జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతుండగా ఒక్క లారీలో పదివేల కిలోల పప్పు ఉంటుంది. ఈ లెక్కన కిలోకు అదనంగా రూ.10 దోచుకుంటున్నారు. అంటే ఒక్కో లారీ అదనంగా రూ.లక్ష అవుతుంది. రెండు లారీలకు రోజుకు రూ.2లక్షల వరకు అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. పెసర పప్పు కూడా రోజుకు ఒక లారీ వినియోగమవుతోంది. దీని మీద కూడా అంతే భారం పడుతోంది. కంది, పెసర పప్పులపై రోజుకు రూ.4లక్షల చొప్పున నెలకు రూ.1.20కోట్ల భారం వినియోగదారులపై పడుతోంది. ఏడాదికి రూ.16కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది. ఇక రైతులకు కూడా దిక్కులేకుండా పోయింది.

పెసలు, కందులను నిల్వ చేసుకున్న రైతులు అవసరం మేర విక్రయించాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి ధాన్యాన్ని తరలిస్తే వ్యాపారుల సిండికేట్‌ దందాల్లో నలిగిపోతున్నారు. ప్రభుత్వం కనీస మద్థతు ధరకు రూ. వేయి తక్కువగా నిర్ణయించి రైతుల నోట్లో మట్టికొడుతున్నారు. అపరాలు ఎక్కువగా పండించే జిల్లాలోని జుక్కల్‌, మద్నూర్‌,పిట్లం, గాంధారి మార్కెట్‌లలో పెసళ్లు క్వింటాల్‌కు రూ.4500 ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్ధతు ధర కందులకు రూ. 5050 కాగా పెసళ్లకు రూ.5225 కానీ మద్దతు ధర మాత్రం అటకెక్కింది.

 మిగిలింది ఒక్క 20 రోజులే మరి

మిగిలింది ఒక్క 20 రోజులే మరి

ఇదిలా ఉంటే జీఎస్టీ అమలులో మూడు నెలలు అవగాహనకు కేటాయించగా ఇప్పటికే రెండు నెలలు పూర్తయ్యాయి. ప్రతిఏటా జూలైలో గతంలో వ్యాట్ రూపేణా రమారమీ రూ.12 వేల కోట్ల పన్ను వసూలయ్యేది. కానీ ఇప్పుడు ఉన్న గందరగోళ పరిస్థితులతో అవగాహన లోపించడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతున్నది. అధికారులకే ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ విధించాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. పన్నుల శాఖ, సెంట్రల్ ఎక్సైజ్, వ్యాట్ అధికారుల్లోనూ ఇదే అయోమయ పరిస్థితి నెలకొన్నది. పన్ను వసూళ్లకు నియమ నిబంధనలు, వాటి అమలుకు అనుసరించాల్సిన పద్దతులపైనా అవగాహన లేదన్న అభిప్రాయం ఉన్నది. ఉదాహరణకు విద్యుత్ బల్బులు, ట్యూబులైట్లు, మోటార్లపై ఉన్న 27 శాతం పన్నును 18 శాతానికి తగ్గలేదు. కానీ వ్యాపారులు కొన్ని ప్రాంతాల్లో పాత ధరలకే వాటిని విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక టూత్ పేస్టులు, షాంపూలు, షేవింగ్ క్రీములు, డియోడరెంట్లపై గల 27 శాతం ఉన్న పన్ను కూడా 18 శాతానికి తగ్గించారు. అలాగే నూనెలపై జీఎస్టీ కూడా తగ్గించారు. దీని ప్రకారం విద్యుత్ బల్బుల ధర కూడా తగ్గాల్సి ఉన్నా పాత ధరలకే విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ దుకాణాలను నుంచి సాధారణ జనరల్ స్టోర్లలోకి వచ్చేసరికి ధరల్లో ఎంతో తేడా ఉంటున్నది.

కానరాని కొత్త ధరల స్టిక్కర్లు

కానరాని కొత్త ధరల స్టిక్కర్లు

దుకాణాల్లో వస్తువులును ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకి, విక్రయిస్తున్న ధరలకు పొంతన ఉండటం లేదు. ప్రతి దుకాణంలోనూ బిల్లులు ఇవ్వాల్సిందే. ప్రజల నిత్యావసర వస్తువులను ఎక్కువగా కిరాణ దుకాణాల్లోనే కొనుగోలు చేస్తారు. రూ.200 దాటితే బిల్లులు ఇవ్వాల్సిన వ్యాపారులు కేవలం చిట్టీలపై వేస్తూ బిల్లులు ఇవ్వకుండా మాయజేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతి వస్తువునూ అధిక ధరకు విక్రయిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇక రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్ల వంటి ప్రదేశాల్లో చెప్పాల్సిన అవసరం లేదు.

దీనివల్ల ఏ వస్తువుకు ఎంత బిల్లు వేయాలో తెలియక వ్యాపారులు, చెల్లించాలో తెలియక ప్రజలు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చాక ధరలపై ఇంకా స్పష్టత కాన రాలేదు. గత నెల ఒకటో తేదీ నుంచి పాత నిల్వలు గల సరుకులపై కొత్త ధరల స్టిక్కర్లు వేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ధరలు తగ్గిన విషయం వినియోగదారులు గుర్తిస్తారని భావించినందునే కేంద్రం ఆ ప్రకటన చేసింది. వ్యాపారులు మాత్రం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ధరలు తగ్గిన వస్తువులను పాత ధరలకు, పెరిగిన ధరలతో కూడిన వస్తువులను కొత్త ధరలకు విక్రయిస్తున్నారు.

వస్తువులను డీలర్ ఎంత ధరకు విక్రయిస్తున్నాడో, ఎంత ధరకు కొన్నాడో వినియోగదారుడికి అర్థం గానీ పరిస్థితి నెలకొన్నది. వ్యాపారులు దీన్ని సావకాశంగా తీసుకుని దోపిడీకి తెర తీశారు. ధరలపై స్పష్టత రానంత వరకు వినియోగదారుడు మోసపోయి జీఎస్టీ నెట్‌వర్క్‌లో భాగంగా ప్రైవేట్ సంస్థలకు అధిక వాటాలు ఉండటంపైనా కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. జీఎస్టీతోపాటు అమలులోకి రావాల్సిన యాంటీ ప్రాఫిటరింగ్ చట్టం ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం. వినియోగదారుల హక్కుల రక్షణ కల్పించేందుకు భంగం వాటిల్లుతుందనే అభిప్రాయం ఆందోళన వ్యక్తం అవుతున్నది.

రిటర్నులపై తొలగని అయోమయం

రిటర్నులపై తొలగని అయోమయం

రూ.1000 లోపు విలువైన రెడీమేడ్ దుస్తులకు ఐదుశాతం, ఆ పై ధరలు గల వాటికి 12 శాతం జీఎస్టీ ఖరారుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లా కేంద్రాలతోపాటు పట్టణాలు, నగరాల పరిధిలో భారీగా రెడీమేడ్ దుస్తుల దుకాణాలు ఉన్నాయి. పెద్ద నగరాల నుంచి వాటిని తక్కువ ధరలకు తెచ్చి వాటిపై పేర్కొన్న ఎమ్మార్పీ మోసాలకు పాల్పడుతున్నారు. అదే స్థాయిలో చెప్పుల పరిస్థితి కూడా ఇదే. బ్రాండెడ్ చెప్పులకు మాత్రమే ఖచ్చితమైన ధర అమలులో ఉన్నది. మిగతా వాటిలో రూ.800 లోపు గల చెప్పుల ఎమ్మార్పీ ధరకు, అసలు ధరకు పొంతన ఉండటం లేదు. జీఎస్టీ వేసినా చివరకు వినియోగదారుడికి ఇచ్చే రేటుకే పాత బిల్లులు వసూలుచేస్తున్నారు. కొత్త చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో వ్యాపారుల్లో ముఖ్యంగా రిటర్నులు దాఖలు చేసే విషయంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వేల మంది వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి వస్తారు.

లక్ష్యాలపై వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు

లక్ష్యాలపై వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు

డీలర్లు ప్రతి నెల కూడా మూడు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రతి పదో తేదీలోపు కొనుగోళ్లపైనా, 15లోపు రిటర్న్స్, 20వ తేదీ లోపు నెలవారీ రిటర్న్స్ దాఖలు చేయాలి. కానీ ఇంకా వెబ్సైట్ ప్రారంభం కాకపోవడంతో చాలా మంది వ్యాపారులు రిటర్నులు దాఖలు చేయలేదని విషయం స్పష్టమవుతున్నది. ఇప్పటివరకు వ్యాట్ సక్రమంగా అమలు చేసిన వ్యాపారులు మాత్రమే జీఎస్టీ అమలుకు సిద్ధంగా ఉన్నారు. అటూఇటూగా వ్యవహరించే వారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనివల్ల బిల్లులు ఫైల్ చేయాల్సిన అవసరం కనిపించకపోవడంతో జీరో దందా చేసేవారు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని జీరో దందాకు తావు లేకుండా వ్యాట్ కంటే అధిక పన్ను వసూలు చేసేందుకు వాణిజ్య పన్నులశాఖ కసరత్తే చేస్తున్నది.

స్ట్రీట్ సర్వే తర్వాత వ్యాపారుల లావాదేవీలపై నిర్ధారణలు

స్ట్రీట్ సర్వే తర్వాత వ్యాపారుల లావాదేవీలపై నిర్ధారణలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జూలై ముందు వరకు వ్యాట్ రూపేణా ప్రతియేటా రూ.375 కోట్లు వసూలయ్యేది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా పరిగణనలోకి తీసుకుంటే రూ.11 వేల కోట్లు వసూలయ్యేదని తెలుస్తున్నది. దీంతో నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు చెందిన వాణిజ్యశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వ్యాట్‌లో రెండు శాతం పన్ను వసూలు చేస్తుండగా, జీఎస్టీలో వ్యాపారాన్ని బట్టి పన్ను వసూలు చేస్తున్నారు. త్వరలో రెండు నెలల్లో జీఎస్టీ ద్వారా వసూలు చేయాల్సిన జీఎస్టీపై ప్రభుత్వానికి ఆదాయం సమర్పించనున్నారు.

జీరో దందా, అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు ప్రతి వ్యాపారి కూడా జీఎస్టీకి కట్టుబడి వ్యాపారం సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం స్ట్రీట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో వ్యాపారుల వద్ద నిల్వలు, విక్రయాలు, సరుకుల దిగుమతిని పరిశీలించాక సదరు వ్యాపారి జీఎస్టీ పరిధిలోకి వస్తాడా? లేదా? అని తేలుస్తారు. వ్యాపార లావాదేవీలు రూ.20 లక్షల వరకు ఉంటే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉన్నది.

 అక్రమాలను అడ్డుకునేదెలా?

అక్రమాలను అడ్డుకునేదెలా?

దీనికి తోడు జూన్ 30వ తేదీ నుంచే జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఎత్తేశారు. ఉదాహరణకు ఉభయ నల్లగొండ జిల్లా పరిధిలోని కోదాడ, నాగార్జున సాగర్, దామరచర్ల పరిధిలో చెక్ పోస్టులు తొలగించడం అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. ఎటువంటి బిల్లులు, పత్రాలు లేకుండానే సరుకుల రవాణా జరుగుతున్నా ప్రస్తుతం పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రధానంగా లారీలు, ట్రావెల్స్ బస్సుల్లో దొంగ సరుకు రవాణా అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సరుకుల బిల్లులు తనిఖీ చేస్తే తప్ప తేలని పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే లక్ష్యానికి మించి రూ.500 కోట్ల పన్ను వస్తే తప్ప ప్రభుత్వం ఆశించిన మేరకు జీఎస్టీ లక్ష్యానికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సుమారు 15 వేల మంది వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి వస్తారని అంచనా. అన్ని అంశాలు కూలంకషంగా పరిశీలిస్తే గానీ జీఎస్టీ పరిధిలోకి ఎంత మంది వ్యాపారులు వస్తారన్న సంగతి తేలదని అధికారులు, వ్యాపారులు చెప్తున్నారు.

English summary
Goods and Services Tax (GST) implemented from 1st July 2017. But in Telangana traders were not followed GST guidelines. Even State government officials is in confusion. This is leads to traders 'zero' business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X