మోడీ పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు: ఎస్సై అభ్యర్థులకు డీజీపీ అంజనీ కుమార్ కీలక సూచనలు
తెలంగాణా రాష్ట్రంలో నేడు, రేపు ఎస్సై టీఎస్ఎస్పి, ఎస్పిఎఫ్, ఎస్ఏఆర్ సిపియల్, ఫైర్ అభ్యర్థులకు జరుగనున్న రాత పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా పరీక్షలు రాసే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలని తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు. నేడు, రేపు ఎస్ఐ రాత పరీక్షలు జరగనున్నాయి.
ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పలుమార్గాలలో రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కొన్ని మార్గాలను మూసివేయనున్నారు. ఇక ఆయా మార్గాలలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇలాంటి తరుణంలో ఎస్ఐ పరీక్షలు రాసే అభ్యర్థులకు డిజిపి అంజనీ కుమార్ కీలక సూచనలు చేశారు.

పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు పరీక్షకు రెండు గంటల ముందే చేరుకోవాలని, ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరగనున్నాయని, ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారని, ఇక ఆ సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవటం ఇబ్బంది అవుతుందని, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే ప్రమాదాన్ని నివారించడం కోసం ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే అంతే కాదు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల ఉత్తర్వులను అతిక్రమించి ర్యాలీ, సమావేశాలు, బహిరంగసభలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఇక అభ్యర్థులు అందరూ హాల్ టికెట్ తో పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ పరీక్షా కేంద్రాలలోనికి తీసుకువెళ్లకూడదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications