ఆంధ్రా పాలకుల్లా: కేసీఆర్‌పై రేవంత్, టీడీపీ సాయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం నిప్పులు చెరిగారు. తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 365 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. శాసన సభను కేసీఆర్, హరీష్ రావులే నడిపిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో పరిపాలించిన ఆంధ్ర పాలకులకు, ప్రస్తుత తెరాస ప్రభుత్వానికి తేడా ఏమీ లేదన్నారు. రైతు సమస్యలపై పోరాడుతున్న తమను సభ నుంచి సస్పెండ్ చేయడం అత్యంత దారుణమన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి అయితే పేదలకు మంచి జరుగుతుందని భావించామని, అయితే ఆయన కూడా దొరల్లాగే పేద ప్రజల గోతులు తవ్వుతున్నారన్నారు.
పంటలు ఎండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కుటుంబ కలహాల వల్లే వారు ఆత్మహత్యలు చేసుకున్నారని పోచారం వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోచారంను సభకు పిలిపించి క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. శాసనసభ పట్ల తెరాసకు ఏ మాత్రం గౌరవం లేదన్నారు. రైతుల పాలిట ఈ ప్రభుత్వం శాపమన్నారు.

పోచారం క్షమాపణ చెప్పాలి: ఎర్రబెల్లి
రైతు ఆత్మహత్యలను అవమానించేలా వ్యాఖ్యానించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. రైతుల ఆత్మహత్య పైన సభలో చర్చ జరగాలన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ప్రభుత్వం రూ.10 లక్షళ చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.
రోజుకు ఐదారుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రభుత్వం దీనిని అరికట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియోజకవర్గమైన గజ్వెల్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయంత్రం రూ.50వేల చొప్పున తాము ఇస్తామన్నారు. శాసన సభలో సస్పెన్షన్‌కు గురైన తర్వాత వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.












Click it and Unblock the Notifications