సహనం కోల్పోయిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే: బూటు కాలితో తన్నుతూ..!
హుస్నాబాద్: టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో సహనం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. తనను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలపై బూటు కాలితో తన్నినట్లు తెలిసింది.

వొడితలకు నిరసన సెగ
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నాయకుడు వొడితల సతీష్ కుమార్ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు కొందరు స్థానికులు నిరసన తెలియజేసేందుకు రోడ్డుపై బైఠాయించారు.

వ్యతిరేక నినాదాలు
నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సహనం కోల్పోయిన వొడితల.. బూటు కాలితో..
ఈ ధర్నాలో స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన వొడితల సతీష్.. వారిపై దూసుకెళ్లారు. వారిని బూటు కాలితో తన్నుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఉద్రిక్తత.. పోలీసుల రంగప్రవేశం
వొడితలతోపాటు అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు కూడా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications