కేసీఆర్, మంత్రులపై కించపరిచేలా: వైఎస్ షర్మిలపై తెలంగాణ స్పీకర్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాసనసభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ చర్చించారు. తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని ఈ సందర్భంగా స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి హామి ఇచ్చారు.

షర్మిలపై మత్రులు ఇచ్చిన ఫిర్యాదును సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించారు. దీనిపై సభా హక్కుల ఉల్లంఘన కమిటీ బుధవారం సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటికే మంత్రి నిరంజన్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.
కాగా, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, మంత్రులను లక్ష్యంగా చేసుకుని వైఎస్ షర్మిల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.












Click it and Unblock the Notifications