సుప్రీంకోర్టుకు చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కేసు.. నేడు విచారణ, సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వదిలిపెట్టకుండా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏకంగా నిన్న వీడియోలను ప్రదర్శించి మరి కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ లతో విచారణ జరిపించాలని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

బీజేపీ పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ
కాగా ఈ కేసును సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు అప్పగించాలన్న బిజెపి పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరపాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని సుప్రీం ధర్మాసనం ముందు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నిందితులకు బిజెపికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తమ నేతలపై దుష్ప్రచారం చేయడానికి రాజకీయంగా ఈ కేసులు పెట్టారని పిటిషన్లో ఆరోపించారు.

తెలంగాణా పోలీసుల అరెస్ట్ లను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ
తెలంగాణ పోలీసుల అరెస్టులను సవాల్ చేస్తూ దాఖలైన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామీజీల కేసును జస్టిస్ గవాయి, జస్టిస్ బివీ నాగరత్న ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే గతంలో తెలంగాణ హైకోర్టులో బిజెపి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుక్కొని వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. దీంతో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని ప్రభుత్వం కేసు తీవ్రతను తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుపై ఏ విధంగా స్పందిస్తుందో
ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు మూడు గంటల పాటు ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నిందితులు ముగ్గురు జరిపిన సంభాషణల తాలూకా వీడియోలను సమర్పించారు. ఇక ఈ కేసులో తాజాగా నిందితుడు నందకుమార్ సతీమణి చిత్రలేఖ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసును సీబీఐ కి గానీ, సిట్ కు గానీ అప్పగించాలని తన పిటీషన్ ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఫాం హౌస్ కు సంబంధించి ఆడియోలు, వీడియోల విడుదలను ఆపాలని కోరింది. ఇదిలా ఉంటే ఇక నేడు సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications