గులాబీ పార్టీలో ఎన్నికల సందడి - తెలంగాణ విజయ గర్జన సభ : షెడ్యూల్ ఇలా - కేటీఆర్..!!
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో సంస్థగత ఎన్నికల సందడి మొదలైంది. అందులో భాగంగా ఇప్పటికే గ్రామ కమిటీలు, వార్డు, కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీల నిర్మాణం పూర్తి చేసారు. ఇక, కీలకమైన పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ -ప్లీనరీ-బహిరంగ సభ వివరాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందన్నారు. 17 నుంచి 22 వ తేదీ వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరణ ఉంటుంది.

టీఆర్ఎస్ లో అధ్యక్ష ఎన్నికలు
23న నామినేషన్ల స్క్రూటినీ/పరిశీలన జరగనుంది. 24 నామినేషన్ల ఉపసంహరణ కు సమయం కేటాయించారు. ఇక, ఈ నెల 25 పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుందని కేటీఆర్ వివరించారు. అదే రోజు ప్లీనరీ సమావేశం జరగనున్నట్లు కేటీఆర్ తెలిపారు.25 న జనరల్ బాడీ సమావేశం లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తి అయిన తర్వాత ప్లీనరీలో వివిధ అంశాలపైన పార్టీకి అధ్యక్షులు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.
పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పార్టీ కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని పార్టీ సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ పర్యవేక్షిస్తారన్నారు.
ప్లీనరీ సమావేశం..పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు
ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాల కమిటీ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ని ఖరారు చేసారు. అక్టోబర్ 17వ తేదీన పార్టీ ఉమ్మడి శాసనసభపక్ష సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కెసిఆర్ గారు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించి.... అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
Recommended Video
తెలంగాణ విజయ గర్జన సభ
ఈ సభకు తెలంగాణ విజయ గర్జన సభగా పేరు ఖరారు చేసారు. లక్షలాది మంది కార్యకర్తలతో 'తెలంగాణ విజయ గర్జన సభ' ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27న అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజున నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ గ్రామ, వార్డ్, మండల ,పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హజరుహజరు.. లక్షలాదిగా తరలిరావాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేసారు.
రెండేళ్లకు ఒకసారి పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగుతాయని, ఎన్నికల కమిషన్‌కు లోబడి ఎన్నిక ఉంటుందన్నారు. నవంబర్ 15 తరువాత పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయని, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటారని పేర్కొన్నారు.