కేంద్ర ప్రభుత్వ పనితీరుపై TRS సర్వే?
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరోసారి సర్వేలు నిర్వహిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై సర్వే జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత మరోసారి పీకేతోపాటు టీఆర్ఎస్ కూడా సొంతంగా రెండురకాల సర్వేలు చేపట్టింది. జిల్లాల అధ్యక్షులు ఒక సర్వే చేస్తుండగా, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మరో సర్వే జరుగుతోంది. ప్రభుత్వ పాలన, ప్రజాప్రతినిధుల పనితీరుతోపాటు అన్నింటికన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పాలనపై సర్వే జరుగుతుండటం విశేషం. దీనివల్ల రాష్ట్రంలోని రాజకీయాలపై ఒక స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.

ప్రతి మూడునెలలకు ఒక సర్వే
తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రతి మూడునెలలకు ఒకసారి సర్వేలు నిర్వహిస్తూ వస్తోంది. 2022 జనవరి నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకోగా ఆయన టీమ్ నెలరోజులు సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చింది. ఆ సర్వేల ఆధారంగా ప్రజాప్రతినిధులకు పార్టీ అధిష్టానం సూచనలు జారీచేస్తూ వస్తోంది. పీకే సర్వేతోపాటు 33 జిల్లాల అధ్యక్షులు తమ జిల్లాల పరిధిలో సర్వేలు చేయాలని అధిష్టానం సూచించింది.

ఎమ్మెల్యేల సర్వే కూడా..
జిల్లాల అధ్యక్షులతోపాటు ఎమ్మెల్యేలు కూడా సొంతంగా సర్వే చేపట్టేందుకు ముందుకు వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో గ్రామాలవారీగా సర్వేలు చేస్తామనడంతో మొత్తం మూడరకాల సర్వేలతో రాష్ట్రంలో సందడి మొదలైంది. ఈ నెలాఖరుకు అధ్యక్షుల సర్వే పూర్తికానుంది. నివేదికలను ఆగస్టు మొదటివారంలో అందజేస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలే జిల్లాల అధ్యక్షులుగా ఉన్నారు. నివేదికలో స్పష్టంగా ఫలితాలను వెల్లడించాలని పార్టీ సూచించింది.

ఆగస్టు 15లోగా సమర్పించాలి
ఎమ్మెల్యేలు ఆగస్టు 15లోగా నివేదికలను ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు సర్వే చేసిన సంస్థల సమాచారం, శాంపిల్స్ వివరాలు సైతం సమర్పించాలి. వాస్తవాల ధ్రువీకరణకు ఇవి ఉపయోగపడతాయని అధిష్టానం భావిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా సర్వేల హడావిడిలో ఉన్నారు. వాటిని బేరీజు వేసి విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపడతారు. ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్న తీరు, ఎన్నికల్లో విజయావకాశాలు? ఎమ్మెల్యేలకు ఎవరు ప్రత్యర్థులుగా నిలబడే అవకాశం ఉంది? తదితర వివరాలను ప్రభుత్వం సేకరించనుంది.












Click it and Unblock the Notifications