బుద్ది జ్ఞానం ఉందా.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. మాటలు జాగ్రత్త : బీజేపీకి టీఆర్ఎస్ వార్నింగ్
తెలంగాణ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాట యుద్ధం తారాస్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీయే టార్గెట్‌గా గులాబీ బాస్ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ గడ్డపై కాషాయాన్ని లేకుండా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అటు పార్టీ అధినేత భాటలోనే గులాబీ దండు కూడా కాషాయ దళంపై ఢీ అంటే ఢీ అంటున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో పాటు బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణ దయా దాక్షిణ్యాల మీద కేంద్రం
కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద బతుకుతోందని రాష్ట్ర పశుసంవవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీజేపీకి మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప మరొకటి తెలియదని దుయ్యబట్టారు. చివరకు భారత ఆర్మీని కూడా తన రాజకీయాలకు వాడుకుంటుందని ఆరోపించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం సంస్కరణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ఇది సిగ్గిచేటని మండిపడ్డారు.

దేశంలో కమలం గల్లంతు
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తోందని తలసాని అన్నారు. కానీ, బీజేపీకి వారి జీవిత కాలం పాకిస్థాన్, హిందుస్తాన్ నినాదం తప్ప మరొకటి లేదని దుయ్యబట్టారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడమే వారికి తెలిసునని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా కమలం గల్లంతయ్యే పరిస్థితి వచ్చించదని విమర్శించారు. మోదీ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆరోపించారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

కిషన్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకో..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. గెలచి మూడేళ్లయింది. కానీ, సికింద్రాబాద్ ప్రజలకు చేసింది మాత్ర శూన్యమన్నారు. వరదలు వస్తే కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చావా అని ప్రశ్నించారు. వరదల సమయంలో రాజకీయ డ్రామాలు చేశారని విమర్శించారు. కిషన్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో తిరగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణకు కేంద్ర నుంచి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ముచ్చింతల్‌కి మోదీ రావడం తప్పు..
ప్రధాని మోదీ తెలంగాణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ముచ్చింతల్‌కి మోదీ రావడం తప్పు అని అన్నారు. ఈ కార్యక్రమం ఈక్వాలిటీ పేరుతో చేసేది.. కానీ మోదీలో మాత్రం సమైక్యత లేదని దుయ్యబట్టారు. దీనిని కూడా ప్రధాని 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంగా వాడుకున్నారని ఆరోపించారు. అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని తలసాని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఇన్ ఛార్జీ మానిక్యం ఠాగూర్ సిగ్గు శరం లేదన్నారు. ఆయన వచ్చాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications