TS polls: ఈసారి కమ్మోళ్లు ఎవరికి ఓటేయాలో చంద్రబాబు చెప్పేశారా ? టీడీపీ రియాక్షన్ ఇదే !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలోని 119 సీట్లకు ఈ నెల 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ తో విపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతోంది. ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ,జనసేన, కమ్యూనిస్టులు, బీఎస్పీ కూడా రంగంలో ఉన్న వారి ప్రభావం తక్కువే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణ ఎన్నికల నుంచి విరమించుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. అయితే ఆ పార్టీనే నమ్ముకున్న చంద్రబాబు సొంత సామాజిక వర్గం, హైదరాబాద్ లో సానుకూల ఓటర్లు ఈసారి ఎవరికి ఓటేయబోతున్నారనే ప్రశ్న ఎదురైంది.
అయితే చంద్రబాబు మాత్రం తన సొంత సామాజిక వర్గమైన కమ్మలకు తాజాగా ఓ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ ఓటు వేయాలంటూ ఆయన కోరినట్లు ఈ ప్రచారం సారాంశం. మారిన పరిస్దితుల్లో బీజేపీ, బీఆర్ఎస్ లతో పోలిస్తే కాంగ్రెస్ కు ఓటేయడమే మేలని ఆయన చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారన్న వాదన వినిపించింది.

తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటేయాలంటూ చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి పిలుపునిస్తూ ఓ లేఖ రాసినట్లు జరుగుతున్న ప్రచారంపై టీడీపీ స్పందించింది. దీనిపై ఫుల్ క్లారిటీ ఇస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో సదరు లేఖతో పాటు టీడీపీ వైఖరిపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటన ద్వారా తెలంగాణ ఎన్నికల విషయంలో టీడీపీ వైఖరిని ఆయన కుండబద్దలు కొట్టినట్లయింది.
వైసీపీ బతుకే ఫేక్ బతుకని, ఫేక్ ప్రచారాలు, ఫేక్ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందని అచ్చెన్నాయుడు అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు లేఖ రాసినట్లు ఒక ఫేక్ లేఖను ప్రచారంలో పెట్టడాన్ని ఆయన ఖండించారు. ఈ లేఖ పూర్తిగా అవాస్తవమని చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ మొదటి నుంచి ఇలాంటి కుట్ర రాజకీయాలనే నమ్మకుందని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం దూరంగా ఉందని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ ఎవరికి ఓటెయ్యాలి అనే విషయంలో ఎటువంటి సూచనలు చేయలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు లేఖ రాసినట్లు ఒక ఫేక్ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని దాన్ని నమ్మవద్దని అచ్చెన్నాయుడు కోరారు. ఈ లేఖలో చంద్రబాబు సంతకం సైతం ఫోర్జరీ చేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసు శాఖకు చిత్తశుద్ది ఉంటే ప్రతిపక్ష పార్టీలు, నేతలపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.












Click it and Unblock the Notifications