తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల: 10/10 సాధించిన 535 పాఠశాలలు
హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. 2,10,647 మంది విద్యార్థులు.. 10 జీపీఏ సాధించినట్లు మంత్రి వెల్లడించారు.
కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది వార్షిక పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఫీజు చెల్లించిన 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించారు. వీరిలో 2,10,647 మంది 10 జీపీఏ సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తం 535 పాఠశాలలు 10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.

విద్యార్థులు తమ మెమోలను ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎస్‌ఎస్సీ బోర్డుకు పంపితే వెంటనే సరిదిద్దుతామని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
పదో తరగతి ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్ సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈసారి హాల్ టికెట్లు జారీ చేయనందువల్ల చదివిని పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసే హాల్ టికెట్ నెంబర్ తోపాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 69,252 నమూనాలను పరీక్షించగా.. 3660 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,44,263కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 23 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3060కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం 574 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4826 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 4,95,446కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 91.03శాతం ఉంది. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications