హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TS weather alert: తెలంగాణలో మరో 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా రాజధాని నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మరో 3-4 రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు

కాగా, తాజాగా, తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఆగస్టు 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలున్నాయని తెలిపింది. శనివారం ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపుల‌తో చాలా చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.

తేలికపాటి జల్లులు

తెలంగాణలో శుక్రవారం పలు ప్రాంతాలలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా.. శనివారం నుండి మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడంతో శుక్రవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా.. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. వీటిలో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. కొమరంభీంఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

కుండపోత వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం

ఇక గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైద‌రాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఖైర‌తాబాద్‌, అమీర్‌పేట‌, సోమాజిగూడ‌, సికింద్రాబాద్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ పాటు ప‌లు ప్రాంతాల్లో కుండపోత వ‌ర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షంతో నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పాతబస్తీ బహదూర్‌పురా దగ్గర రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రహదారులపై భారీ వరదలో వేర్వేరు ప్రాంతాల్లో కొట్టుకుపోతున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు కాపాడారు.

హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం

మరోవైపు, ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో స‌ముద్ర మ‌ట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఆంధ్రా-తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గండిపడ్డ చెరువులు, దెబ్బతిన్న రోడ్లు, జలమయమైన గ్రామాలు. నీట మునిగిన పంటపొలాలు.. ఇలా ఎటూ చూసినా భారీ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలోనే గాక, జిల్లాల్లో కూడా వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో కురిసిన వానకు నరసింహులగూడెం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైకుపై వెళ్తున్న వ్యక్తులు ఇద్దరు నీళ్లలో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో ఉంటున్న వాళ్లకు వర్షాలు, వరదల కారణంగా అవస్థలకు గురవుతున్నారు. కొత్తపల్లి వాసులు రేషన్ బియ్యం, నిత్యవసర సరుకులు తీసుకునేందుకు బజార్‌హత్నూర్‌కి వచ్చి వరదలో చిక్కుకుపోయారు. ప్రాణాల్ని పణంగా పెట్టి వాగు దాటుతున్నారు. భారీ వర్షం కారణంగా నిర్మల్ జిల్లాలోని వాడి గ్రామం దగ్గరున్న బ్రిడ్జి కూలిపోయింది. దీంతో వాడి-కోతల్‌గామ్ గ్రామాలకు బాహ్య సంబంధాలు తెగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని రోడ్లతోపాటు జిల్లాల్లోని రహదారులు కూడా వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు చేసే వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.

English summary
TS weather: next 3-4 days heavy rains in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X