TSPSC సంచలనం: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా ఈ పరీక్షలు రద్దు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. దీంతోపాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్-1 ఈ ఏడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) నివేదిక ఆధారంగా ఆ పరీక్షలను రద్దు చేసినట్లు టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది. గత అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు.

అయితే, ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్ పీఎస్సీ.. ఇప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు, త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేయాలనే యోచనలో టీఎస్ పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గత సంవత్సరం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 విభాగాలకు చెందిన 503 పోస్టులకు గానూ గత అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.42 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1019 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 2.86 లక్షల మంది రాశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసినవారిలో 25,050 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది టీఎస్‌పీఎస్సీ. అయితే, తాజాగా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయడంతో అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications