TSRTC.. బస్ ఛార్జీల్లో భారీ డిస్కౌంట్..!!
హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలకు యావత్ దేశం సన్నద్ధమౌతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రజలను సూచించింది. నెటిజన్లు జాతీయ పతాకాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలను పెట్టుకోవాలనీ విజ్ఞప్తి చేసింది.
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో టీ-24 టికెట్‌ను 75 రూపాయలకే ఇవ్వనుంది. పిల్లలకు టీ-24 టికెట్‌ను 50 రూపాయలకే అందజేస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఒక్క రోజు మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టీ-24 టికెట్ రేటు 120 రూపాయలు. మహిళలు, సీనియర్ సిటీజన్లకు 100 రూపాయలకే అందిస్తోంది. 12 ఏళ్లలోపు పిల్లలకు 80 రూపాయలుగా నిర్ధారించింది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఈ టీ-24 టికెట్‌ను ప్రయాణికులందరికీ 75 రూపాయలకే విక్రయిస్తుంది. పిల్లలకు 50 రూపాయలకే అందిస్తుంది.

రాష్ట్రంలో అన్ని పల్లె వెలుగు బస్సుల్లో 60 సంవత్సరాలు పైనున్న సీనియర్ సిటీజన్లకు పంద్రాగస్టు రోజున టికెట్‌లో 50 శాతం రాయితీని కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటీజన్లు ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్‌కు తమ ఆధార్ కార్డును చూపించాలి.
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలకు తెలుసుకోవడానికి ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033కు ఫోన్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications