ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం - ప్రభుత్వానికి ప్రతిపాదనలు : పెరిగేది ఎంతంటే..!!
ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం అయింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నాలుగు ప్రతిపాదనలు అందించారు. ఛార్జీల పెంపు పైన ఆర్టీసీ అధికారులు నేరుగా ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించారు. వచ్చే మంత్రివర్గ సమావేశం లోగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం సూచించారు. దీంతో..అధికారులు ఏ మేర పెంచితే..ఎంత మేర నష్టం భర్తీ అవుతుందనే అంశం పైన ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందించారు. ఒకటి రెండు రోజుల్లోనే సీఎం దీని పైన ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

పెంపు తప్పదంటూ అధికారుల నివేదన
అధికారులు సమర్పించిన నాలుగు ప్రతిపాదనల్లో ప్రజల పైన తక్కువ భారం పడే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ నిర్ణయం అమలు జరగాల్సి ఉన్నా...హుజూరాబాద్ బై పోల్ కారణంగానే వాయిదా పడిందనే అభిప్రాయమూ ఉంది. తెలంగాణ ఆర్టీసీ చివరగా 2019లో ఛార్జీలను సవరించింది. ఆ సమయంలో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది. దీనివల్ల ప్రజలపై ఏటా రూ.550 కోట్ల భారం పడుతోంది. చార్జీలు పెంచిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.68గా ఉంది. ఇప్పుడది రూ.105కు చేరుకుంది.

తగ్గిన డీజిల్ ఛార్జీలు..లెక్కలు ఇలా
తాజాగా కేంద్రం సుంకం తగ్గించటంతో రూ.90 దిగువకు (ఆర్టీసీకి రాయితీ ధర మేరకు) చేరింది. అయినా... గతంలో చార్జీలు పెంచినప్పటి నుంచి ప్రస్తుత ధరతో బేరీజు వేసుకుంటే లీటరుపై రూ.20కి పైనే ఎక్కువగా ఉంది. అప్పటితో పోలిస్తే నిత్యం అదనంగా రూ.1.22 కోట్ల కంటే ఎక్కువ భారం పడుతోంది. కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకంపై తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు కొంతమేర తగ్గాయి. లీటరు డీజిల్‌పై రూ.10 తగ్గడంతో ఆర్టీసీకి పెద్ద ఊరటగానే మారింది. దీంతో రోజువారీ వినియోగిస్తున్న 6.50 లక్షల లీటర్ల డీజిల్‌పై లెక్కగడితే రూ.65 లక్షలు నేరుగా ఆదా అవుతుంది.

కిలో మీటరకు 25 పైసల మేర పెరిగే ఛాన్స్
ఆర్టీసీ వినియోగిస్తున్న అద్దె బస్సులపై వచ్చే ఆదాను కూడా జోడిస్తే అది రూ.90 లక్షల వరకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు ఏ రకంగా అవసరంగా మారిందో అధికారులు తాము సమర్పించిన నివేదికల్లో స్పష్టం చేసారు. ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనల్లో.. కి.మీ.కు 15 పైస లు, 20 పైసలు, 25 పైసలు, 30 పైసలు.. ఇలా దేని ప్రకారం ఎంత ఆదాయం పెరుగుతుందనే లెక్కలు అందించారు. 20 పైసలు పెంచితే రూ.625 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 25 పైసలు పెంచితే దాదాపు రూ.750 కోట్లు పెరుగుతుందని, 30 పైసలైతే రూ.900 కోట్లకు పైగా పెరుగుతుందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ తుది నిర్ణయం
ఇందులో కి.మీ.కు 25 పైసలు పెంచే ప్రతిపాదన అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 30 పైసలైతే ఆర్టీసీకి మ రింత మెరుగ్గా ఉండనున్నా.. ప్రజలు భారం గా భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా 25 పైసల పెంపు కు ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని పైన ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications